
ప్రధానిగారూ మమ్మల్ని కాపాడండి!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండురోజుల పర్యటన కోసం ఖతార్ చేరుకున్న నేపథ్యంలో.. ఆ దేశంలోని దోహాలో చిక్కుకున్న భారతీయులు తమ మొర ఆలకించమని ప్రధానిని వేడుకుంటున్నారు. దోహాలోని పలువురు భారతీయ, నేపాలీ కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టాలను కడతెర్చి.. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఖతార్ పర్యటన సందర్భంగా ఆయన భారతీయ కార్మికులు ఉన్న కొన్ని క్యాంపులను సందర్శించే అవకాశముంది. అయితే, ఇందులో భారతీయ కార్మికులు చిక్కుకొని అవస్థలు పడుతున్న క్యాంపులు లేకపోవడంతో వారు మీడియా ద్వారా తమ కష్టాలను ప్రధానికి విన్నవించారు.
దోహాలో చిక్కుకుపోయిన తమకు గత ఐదారు నెలలుగా వేతనాలు అందడం లేదని, తిండి తినేందుకు కూడా డబ్బులేని దుర్భర పరిస్థితుల్లో తామున్నామని భారతీయ కార్మికులు తెలిపారు. భారత్‌కు తిరిగి వచ్చేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని, దీంతో గత్యంతరం లేక క్కిక్కిరిసిన క్యాంపుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని వారు చెప్పారు.