ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 'బడ్జీ స్మగ్లర్స్'
లండన్: ఇంటర్నెట్‌లో విరివిగా ఉపయోగించే సంక్షిప్త పదాలు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి. సామాజిక మాధ్యమంలో తరచుగా వినియోగించే ఎఫ్‌డబ్ల్యూఐడబ్ల్యూ (ఫర్ వాట్ ఇట్స్ వర్త్), ఐసీవైఎంఐ (ఇన్ కేస్ యు మిస్డ్ ఇట్) వంటి వాటిని తాజాగా డిక్షనరీ ఆధునీకరణలో చేర్చారు. వీటితోపాటు బడ్జీ స్మగ్లర్స్ (పురుషుల లో దుస్తులు), గ్లాంపింగ్ (పర్యాటక ప్రాంతాల్లో ఉండే విలాసవంతమైన నివాసం), లిస్టికిల్స్ (వార్తాపత్రికలు, ఇంటర్నెట్‌లో ప్రచురించే ఆర్టికల్స్‌ను జాబితా రూపంలో ఇవ్వటం) వంటి పదాలను కూడా చేర్చారు.
టేట్స్ కార్టూన్‌లో ఓ క్యారెక్టర్ పేరైన బోవ్వర్ (దౌర్జన్యం) కూడా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తాజా చేర్పుల్లో ఉంది. తోటి మగ స్నేహితుడిని డ్యూడ్ అని పిలుస్తున్నట్లే.. ఆడ స్నేహితులను పిలిచే డ్యూడెట్‌ను కూడా ఈసారి చేర్చారు. ఈసారి ఆధునీకరణలో వెయ్యికి పైగా కొత్త పదాలు, దాదాపు 2వేల పాత పదాలకు విస్తారమైన అర్థాలున్నాయని బీబీసీ వెల్లడించింది. సెప్టెంబర్ లో మరోసారి ఈ డిక్షనరీని అప్‌డేట్ చేయనున్నారు.