
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్–ఇంగ్లిష్–తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను అందించనుంది. వీటి కొనుగోలుకు అనుమతిస్తూ సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–36 విడుదల చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద మూడు జతల యూనిఫారం, పాఠ్యపుస్తకా లు, నోట్ పుస్తకాలు, ఒక జత షూలు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగును అందిస్తున్న సంగతి తెలి సిందే.
ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు కూడా చదువుల్లో రాణించేందుకు, డ్రాప్‌అవుట్లు తగ్గించేందుకు.. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ఈ ‘విద్యాకానుక’ పథకానికి శ్రీకారం చుట్టారు. 2021–22 విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం రూ.731.30 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది ఇచ్చిన వస్తువులతో పాటు ఈ ఏడాది అదనంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిక్షనరీలను కూడా అందించాలని నిర్ణయించింది. ముం దుగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లి్లష్–ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీలను అందించాలని ఇందుకోసం నియమించిన కమిటీ గుర్తించింది. దీంతో 6–10వ తరగతి విద్యార్థుల కోసం 23,59,504 ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.