సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆచూకీ కనుక్కోవాలని ఇంటర్‌పోల్ ప్రపంచ దేశాలను కోరింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్మాతికవేత్త నిత్యానంద గత ఏడాది విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ ఉంటే తెలపాలని భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బుధవారం ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలుచోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. లైంగిక, అత్యాచార ఆరోపణల్లో ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. (నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి)
గుజరాత్, కర్ణాటక పోలీసుల వాంటెడ్ లిస్టులో నిత్యానంద ఉన్నారు. చిన్న పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమంలో బంధించి.. లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైన కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్‌లో కైలాసాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ఓ వీడియోలో నిత్యానంద బహిరంగ ప్రకటన విడుదల చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఆయనను ఈక్వెడార్‌లో లేరని, హైతీకి పారిపోయినట్లు ఈక్వెడార్ ఎంబసీ స్పష్టం చేసింది. ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద పేరుపెట్టినట్టు కూడా వార్తలు బలంగా వినిపించాయి. (నిత్యానంద మరో అకృత్యం)
Comments
Please login to add a commentAdd a comment