తెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరూసలేం ప్రకటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఉగ్రవాదులను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారంటూ చెప్పుకుంటున్న నేపథ్యంలోనే ఓ గట్టి వార్నింగ్ వచ్చి పడింది.
ఇరాక్‌కు చెందిన అల్-నొజాబా అనే మిలిటెంట్ సంస్థ తమ దేశంలో మోహరించిన అమెరికా సైన్యంపై ఏ క్షణంలోనైనా దాడి చేస్తామని ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్ అక్రమ్ అల్ కాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 1500 మంది సైన్యంతో ఐసిస్‌తో కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పని చేస్తోంది.
సుమారు 6 వేల మంది అమెరికా సైనికులు మోహరించినట్లు పెంటగాన్ వెల్లడించగా.. ఆ సంఖ్య 9 వేల దాకా ఉండొచ్చన్న మరో అంచనా ఉంది. కాగా, ట్రంప్ వ్యాఖ్యలతో వారందరికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టెల్ అవివ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్రంప్ చేసిన ప్రకటనను అరబ్ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.
భారత్ తటస్థం... ?
పాలస్తీనా విషయంలో తాము తీసుకునే నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తించడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ భారత్ తరఫున ప్రకటన చేశారు. భారత్ తన అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే ఉంటుందని, దీన్ని ఏ మూడో దేశం నిర్ణయించబోదని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment