మెదడు పెద్దగా ఉన్నా.. అంతే తెలివితేటలు!
మెదడు పెద్దగా ఉండే జీవులకు తెలివితేటలూ ఎక్కువగా ఉంటాయన్న భావన తప్పట. పెద్ద జీవులకు మెదడు పెద్దగా ఉన్నంత మాత్రాన చిన్న జీవులకన్నా మించిన తెలివి ఉండబోదట. పెద్ద ఎలుకలు(ర్యాట్స్), చిట్టెలుకలు(మైస్)పై పరిశోధన నిర్వహించిన అమెరికాలోని ‘కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ’ శాస్త్రవేత్తలు ఈ సంగతి వెల్లడించారు. మెదడు పెద్దగా ఉండే పెద్ద ఎలుకలకు చిట్టెలుకల కన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తున్నారు. కానీ విషయాలను నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఎలుకలు, చిట్టెలుకల మధ్య పెద్దగా తేడా లేదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెద్ద ఎలుకలు, చిట్టెలుకల్లో సంక్లిష్ట విషయాలు నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, శబ్దాలకు స్పందన, ప్రవర్తన, ఇతర పలు అంశాలను పరీక్షించిన వీరు.. ఎట్టకేలకు రెండింటి తెలివితేటల స్థాయి ఒకటేనని తేల్చారు. చిట్టెలుకల కన్నా పెద్ద ఎలుకలు కాస్త వేగంగా విషయాలను నేర్చుకున్నప్పటికీ.. వాటికి శిక్షణ ఇచ్చే పద్ధతులు మెరుగ్గా ఉండటం వల్లే అలా జరిగిందని వీరు అంటున్నారు.