ఇజ్రాయెల్ ప్రధాని సతీమణికి కష్టాలు!
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య చిక్కుల్లో పడనున్నారు. అక్రమంగా భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్ము వెనుకేసుకున్నారనే పేరిట ఆమె ఆరోపణలు ఎదుర్కోనున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నిధులను వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించుకోవడమే కాకుండా అక్రమంగా దాదాపు లక్ష డాలర్లను వెనుకేసుకున్నారనే పేరిట నెతన్యాహు భార్య సారా విచారణ ఎదుర్కోనున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ న్యాయ శాఖ ఒక ప్రకటన చేసింది.
అటార్నీ జనరల్ సారా నెతన్యాహు చేసిన తప్పిదాలకు సంబంధించిన విచారణను చూస్తున్నారని ఈ మేరకు ఆ శాఖ ప్రకటించింది. వ్యక్తిగత డైనింగ్ కార్యకలాపాలకు, క్యాటరింగ్ వంటి సర్వీసులకు ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేశారని, విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే, ఇవన్నీ వాస్తవాలు కావని త్వరలోనే సారా నిరూపించుకుంటారని ప్రధాని నెతన్యాహుకు చెందిన ఫేస్‌బుక్ పేజీలో వివరణలాంటి పోస్టింగ్ రిప్లైగా పెట్టారు. అయితే, ఈ అంశం రాజకీయపరమైన ప్రభావాన్ని ఏ మేరకు చూపుతుందనేది తెలియాల్సి ఉంది.