ప్రధాని భార్యపై ఫ్రాడ్ కేసు!
ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భార్య సరా నెతన్యాహు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఫ్రాడ్ కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్టు తాజాగా ఇజ్రాయెల్ టాప్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. క్యాటరింగ్ కోసం ప్రభుత్వ నిధులు 3.59 లక్షల షెకెల్స్ (రూ. 63.94లక్షలు) అక్రమంగా ఖర్చు చేసినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను ప్రధాని బెంజమిన్ కొట్టిపారేస్తున్నారు. తన భార్యపై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ న్యాయశాఖ మాత్రం ఈ విషయంలో బెంజమిన్ భార్యపై అభియోగాలు నమోదుచేసే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ జరిగిన నేపథ్యంలో త్వరలోనే సరా నెతన్యాహుపై ఫ్రాడ్ కేసు నమోదుచేయవచ్చునని మీడియా ఊహాగానాలు చేస్తోంది.
సెప్టెంబర్ 2010, మార్చి 2013 మధ్యకాలంలో ప్రధాని నివాసంలో ఇచ్చిన విందుల కోసం విచ్చలవిడిగా ఖర్చుచేసినట్టు సరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని నివాసంలో ప్రభుత్వం నియమించిన చెఫ్ ఉన్నప్పటికీ, ప్రైవేటు చెఫ్‌లతో వంటకాలు చేయించి ఆమె విందులు ఇచ్చారని, ప్రైవేటు చెఫ్‌లకు ప్రభుత్వ నిధుల కేటాయింపు చట్టవిరుద్ధమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ప్రైవేట రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించడం, ప్రైవేటు చెఫ్‌లకు చెల్లింపులు చేయడం కోసం అక్రమంగా 359,000 షెకెల్స్‌ను ఖర్చుచేసినట్టు ప్రభుత్వ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. అయితే, తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధించడం కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని నెతన్యాహు అంటున్నారు.