
కేన్సర్ సోకిందంటే చాలు.. ఇక మరణమే అని అనుకునేవారు ఒకప్పుడు! సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులో..పరిశోధనల ఫలితమో కానీ ఇప్పుడు ఈ వ్యాధి సోకినా కొన్నేళ్లపాటు బతికేయొచ్చు అన్న భరోసా వచ్చింది.. ఇప్పటికీ సాధ్యం కాని విషయం ఏంటంటే..కేన్సర్‌ను నయం చేయడం! ఈ లోటును ఏడాదిలోపే తాము భర్తీ చేస్తామంటోంది ఏఈబీఐ అంతటి అద్భుతం ఈ కంపెనీ చేతిలో ఏముంది?
ఏటా రెండు కోట్ల మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కేన్సర్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏఈబీఐ ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే.. హెచ్‌ఐవీ చికిత్సను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఒకప్పుడు ఈ వ్యాధికి బోలెడన్ని మాత్రలు ఇచ్చేవారు. రోజుకు ఇరవై ముప్పై మాత్రలు వేసుకున్నా ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. కానీ.. యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ (ఏఆర్‌టీ) రంగ ప్రవేశంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. మూడు మందులను కలిపివాడే ఈ ఏఆర్‌టీ మందుల వాడకంతో ఇప్పుడు హెచ్‌ఐవీతోనూ దశాబ్దాల పాటు బతకడం సాధ్యమవుతోంది. దాదాపు ఇలాంటి పద్ధతినే కేన్సర్ వ్యాధికి వర్తింప జేసింది ఇజ్రాయెల్ కంపెనీ ఏఈబీఐ. ఈ పద్ధతికి ఏఈబీఐ పెట్టిన పేరు ముటాటో. మల్టీటార్గెట్ టాక్సిన్‌కు క్లుప్తరూపం ఈ ముటాటో. కేన్సర్ చికిత్సకు ఇప్పటివరకూ వాడుతున్న వేర్వేరు పెప్టైడ్‌లను కలిపి వాడటం ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇవన్నీ ఏకకాలంలో కేన్సర్ కణాలపై దాడి చేస్తాయి. ఫలితంగా కేన్సర్ కణాలు నాశనమవుతాయని ఏఈబీఐ సీఈవో ఇలాన్ మొరాద్ చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతి కేన్సర్ కణాల సృష్టికి కారణమైన మూలకణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని అంటున్నారు. కేన్సర్ కణాలు సాధారణంగా రోగ నిరోధక వ్యవస్థ కళ్లు కప్పేందుకు డీఎన్‌ఏలో మార్పులు జరుగుతుంటాయని.. తమ పద్ధతి ద్వారా ఇది కూడా వీలుకాదని వివరించారు.
పరిశోధనకు నోబెల్..
ఏఈబీఐ అభివృద్ధి చేస్తున్న కొత్త కేన్సర్ చికిత్స పద్ధతి ఇంకో ఏడాదిలోపే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇలాన్ చెబుతున్నారు. ఎస్‌ఓఏపీ అనే ప్లాట్‌ఫాం ద్వారా అన్ని రకాల కేన్సర్లపై పోరాడే లక్షణాలు ఉన్న పెప్టైడ్‌లను గుర్తించడం ద్వారా ఈ కొత్త పద్ధతి తొలి రోజు నుంచి ప్రభావం చూపుతుం దని అంచనా. బ్యాక్టీరియాలపై దాడి చేసే వైరస్‌లోకి నిర్దిష్ట ప్రొటీన్లను ఉత్పత్తి చేసే డీఎన్‌ఏ పోగులను ప్రవేశపెట్టడం ద్వారా ఇది జరుగుతుంది. ఈ ప్రొటీన్‌ను సులువుగా గుర్తించవచ్చని, అదెలా పనిచేస్తుందో కూడా గమనిస్తుండవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా కొత్త, వినూత్నమైన పెప్టైడ్‌లను సృష్టించొచ్చన్న పరిశోధనకే గతేడాది నోబెల్ బహుమతి దక్కింది. ఏఈబీఐ ఎలుకలపై ప్రయోగాలు చేసి సానుకూల ఫలితాలు రాబట్టింది.
వ్యక్తిగత వైద్యం..
ముటాటో కేన్సర్ చికిత్స పద్ధతిలో ఉండే ఇంకో విశేషం ఇది అందరికీ ఒకే మందు ఇవ్వడం కుదరదు. కేన్సర్ కణితి నుంచి నమూనా సేకరించి అందులో ఎక్కువగా కనిపిస్తున్న కణ లక్ష్యాలను ముందుగా గుర్తిస్తారు. ఆ తర్వాత వాటికి విరుగుడుగా పనిచేసే పెప్టైడ్‌లను సిద్ధం చేసి అందిస్తారు. అంటే ఇది వ్యక్తిగత వైద్యం అన్నమాట. వేర్వేరు కేన్సర్లకు అవసరమైన పెప్టైడ్‌లన్నీ ఒకే ప్లాట్‌ఫాంపై ఏర్పాటు కావడం వల్ల కేన్సర్ కణాలకు మాత్రమే నష్టం జరుగుతుందని కంపెనీ చెబుతోంది. కేన్సర్‌కు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స పద్ధతులు అనేక దుష్ప్రభావాలు చూపుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. బహుళ పెప్టైడ్ విధానం వల్ల ఈ సమస్యలేవీ ఉండవు. పైగా ముటాటో మందులు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. కొన్ని వారాల పాటు మందులు వాడితే సరిపోతుంది. అంతా బాగుందికానీ.. ఏఈబీఐ ప్రయోగాలకు సంబంధించి ఇప్పటివరకూ ఇతర శాస్త్రవేత్తల సమీక్ష జరగలేదు. ఈ లోటును కూడా పూరించుకుంటే కేన్సర్‌పై పోరులో కొత్త అధ్యాయం మొదలైనట్లే.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment