అన్ని కేన్సర్లకు ఒకే టీకా..! | "New Report Shows That The Most Popular Weed-Killer In The US Probably Causes Cancer" | Sakshi
Sakshi News home page

అన్ని కేన్సర్లకు ఒకే టీకా..!

Published Mon, Mar 23 2015 8:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

అన్ని కేన్సర్లకు ఒకే టీకా..!

అన్ని కేన్సర్లకు ఒకే టీకా..!

* కేన్సర్ కణాలను గుర్తించేలా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం
* శరీరంలోకి టీ-కణాలు ప్రవేశపెట్టి కేన్సర్ నివారణ
* మూడేళ్ల క్రితమే అమెరికా మహిళపై ప్రయోగం

 
కేన్సర్ చికిత్స కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్త వ్యాక్సిన్లతో ఈ మహమ్మారిని జయించే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. కేన్సర్‌పై పోరాటంలో ‘గేమ్ చేంజర్’అనదగ్గ కొత్త వ్యాక్సిన్లను ఆవిష్కరించడంలో అతిపెద్ద విజయం సాధించారు. కీమోథెరపీ, డ్రగ్స్ వంటి పద్ధతులు కాకుండా రోగనిరోధక శక్తి ద్వారా కేన్సర్ కణాలను నాశనం చేసే సరికొత్త వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా రోగులే కేన్సర్‌ను జయించేలా చేయాలనేది శాస్త్రవేత్తల ప్రయత్నం.  
 
 కేన్సర్‌పై పోరాటంలో పరిశోధకులు ఘన విజయం సాధించారు. కీమోథెరపీ, డ్రగ్స్ పద్ధతులు కాకుండా రోగనిరోధక శక్తి ద్వారా కేన్సర్‌కణాలను నాశనం చేసే సరికొత్త టీకాను ఆవిష్కరించారు. దీని ద్వారా రోగులే వ్యాధిని జయించేలా చేయాలనేది శాస్త్రవేత్తల ప్రయత్నం. ఇప్పటికే అమెరికాకు చెందిన ఒక మహిళపై ఈ ప్రయోగం విజయవంతమైంది. బ్లడ్ కేన్సర్‌చివరి దశలో ఉన్న ఆమెకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి ఆమె జీవితకాలాన్ని అనూహ్యంగా పెంచారు. కొన్ని నెలల్లోనే దీని బారి నుండి బయటపడటమే కాక మూడేళ్ల తర్వాత కూడా ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే వ్యాధి నుంచి బయటపడినవారు ఆమె ఒక్కరే కాదని వైద్యులు చెపుతున్నారు. మరోవైపు బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఇటువంటి విధానంపైనే పరిశోధనలు సాగిస్తున్నారు.
 
 టీ-సెల్స్ కీలకం: అమెరికా, బ్రిటన్ ఈ రెండు విధానాల్లోనూ కేన్సర్‌పై పోరాటానికి టీ-సెల్స్(తెల్ల రక్తకణాలు) కీలకం. కేన్సర్‌కణాల ఉపరితలంపై ఉండే ‘డబ్ల్యూటీ1 ప్రొటీన్’ను గుర్తించే సామర్థ్యాన్ని ఈ కణా లకు అందిస్తారు. లుకేమియా(రక్త కేన్సర్‌ై)తో బాధపడే రోగులపై ఈ పరిశోధనలు సాగుతున్నాయి. అయితే రొమ్ము, ప్రేగు, ప్రొస్టేట్ మొదలైన కేన్సర్లపై పోరాటానికి కూడా ఈ విధానాన్ని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ కేన్సర్ కణాల ఉపరితలంపైనా డబ్ల్యూటీ1 ఉంటుందని, అందువల్ల ఈ టీకా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కేన్సర్‌ను జయించడంలో దీనిని ‘యూనివర్సల్ కేన్సర్ వ్యాక్సిన్’ అని శాస్త్రవేత్తలు ఇప్పటికే భావిస్తున్నారు.
 
 మూడేళ్లుగా చికిత్స..
 న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ గ్వున్‌తెర్ కోహెన్ మూడేళ్లుగా 15 మంది ప్లాస్మా సెల్ లుకేమియా రోగులకు టీ-కణాల ద్వారా చికిత్స అందించారు. సాధారణ చికిత్సను అందిస్తే ఈ 15 మంది రోగుల్లో చాలా మంది నెలలు మాత్రమే బతకడానికి అవకాశం ఉందని, కానీ తమ టీకా వల్ల వీరిలో సగం మందికిపైగా ఇప్పటికీ బతికే ఉన్నారన్నారు. కోహెన్ తొలి రోగి గ్రాఫిక్ డిజైనర్ రూత్ లాసీ(64)కు 2012లో ఈ చికిత్స చేశారు.
 
 బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలు..
 బ్రిటన్ శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి చికిత్సకు  ప్రయత్నిస్తున్నారు. వర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, రాయల్ ఫ్రీ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ ఎమ్మా మోరిస్ బృందం ఈ పరిశోధనలు జరుపుతోంది. 20 మంది లుకేమియా రోగులకు డీఎన్‌ఏలో టీ-కణాలను ప్రవేశపెట్టి రోగి శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. ఇవి డబ్ల్యూటీ1 ప్రొటీన్‌ను గుర్తించగలవు. చాలామందిలో రోగనిరోధక కణాలు కేన్సర్ కణాలను గుర్తించలేవు. కేన్సర్‌పై పోరాటంలో ఇదే అతిపెద్ద సమస్య. జన్యుపరమైన మార్పులు చేసిన టీ-కణాలు.. లుకేమియా కణాలను త్వరగా గుర్తించి నిర్మూలిస్తాయి. 
 
 చికిత్సా విధానం ఇలా...
 దాత నుంచి ఎముక మజ్జ(బోన్ మ్యారో) తీసు కుని చికిత్స అందిస్తారు. మజ్జను మూలకణాలు, టీ-కణా లు గా విభజిస్తారు. రోగి శరీరంలోకి నేరుగా మూల కణాలను ఇంజెక్ట్ చేస్తారు. టీ-కణాలను కేన్సర్ కణాల ఉపరితలంపై ఉండే డబ్ల్యూటీ1 ప్రొటీన్‌ను గుర్తించేలా ల్యాబ్‌లో జన్యుపర మార్పులు చేస్తారు. వీటిని రోగికి ఇంజెక్ట్ చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి కేన్సర్ కణాలను నిర్మూలిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement