కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం ఎక్కడ!? | Is it Failure of WHO on Corona Pandemic | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం ఎక్కడ!?

Published Thu, May 7 2020 2:08 PM | Last Updated on Thu, May 7 2020 2:35 PM

Is it Failure of WHO on Corona Pandemic - Sakshi

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌

న్యూయార్క్‌: కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సకాలంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించి హెచ్చరించలేదన్న కారణంగా ఆ సంస్థకు నిధులను నిలిపి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. అమెరికా ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థకు 400 మిలియన్‌ డాలర్లను (3,100 కోట్ల రూపాయలు) అందజేస్తోంది. ప్రపంచ ఆరోగ్య రంగంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలేమిటో ఎప్పటికప్పుడు తెలియజేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించగా, చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కుమ్మక్కువడంతో కరోనా వైరస్‌కు సంబంధించిన నిజమైన సమాచారాన్ని వెల్లడించలేదని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.

అమెరికా ఆరోపిస్తున్నట్లు కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు విఫలం అయింది? అందుకు కారణాలేమిటీ? ఈ విషయంలో ఓ దేశం ఇచ్చే సమాచారంపైనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కువగా ఆధారపడుతుంది. అదనపు సమాచారం కోసం తమ అధికారులను సదరు దేశానికి పంపించాలంటే ఆ దేశం అనుమతి తప్పనిసరి అవుతుంది. ఓ దేశానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించాలన్నా, తగిన సిఫార్సులు చేయాలన్నా అధికారం అంతంత మాత్రమే. (న్యూయార్క్‌ ఆవల వైరస్‌ విజృంభణ)

కరోనా వైరస్‌కు సంబంధించి వైద్య నిపుణులకు జనవరి నెలలోనే తెలిసినప్పటికీ దాని తీవ్రత ఎంత, ఎంత వేగంగా ఎందరికి, ఎలా వ్యాపిస్తుందీ అన్న విషయాలు తెలియవు. ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించాలా, లేదా అన్న విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారుల సత్వర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ కరోనా వైరస్‌పై అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. 2009లో హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయెంజా, 2014లో ఎబోలా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగా స్పందించి అభాసు పాలయింది. 2009లో హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయెంజాపై ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీల నుంచి లక్షల్లో వ్యాక్సిన్‌ డోస్‌లను కొనుగోలు చేశాయి. యుద్ధ ప్రాతిపదికపై వ్యాక్సిన్‌ కార్యక్రమాలను అమలు చేశాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాయి. ఆ తర్వాత తెల్సిందీ ఆ వైరస్‌ అంత తీవ్రమైనది కాదని. మరణాలు కూడా అతి తక్కువని. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతో కుమ్మక్కయిందని, శతాబ్దంలోనే అతి పెద్ద వైద్య కుంభకోణం’ యూరప్‌ దేశాల వైద్య నిపుణులు విమర్శించారు.

2014లో ఎబోలా వైరస్‌ విజృంభించినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సకాలంలో స్పందించక పోవడంతో విమర్శలకు గురికావాల్సి వచ్చింది. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 2014, ఫిబ్రవరి నెలలో ఎబోలా విజృంభించగా, ఆగస్టులో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటికే ఎబోలా వల్ల కొన్ని వందల మంది మరణించడంతో ‘సిగ్గుచేటు’ అంటూ పలు దేశాలు డబ్ల్యూహెచ్‌ఓను విమర్శించాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉన్నందున ‘కరోనా వైరస్‌’పై ఆర్థిక అత్యయిక పరిస్థితిని ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాత్సారం చేసింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఎక్కువ నిధులిచ్చే అమెరికా, చైనా లాంటి దేశాలే తమ వైద్య నిపుణులను ప్రపంచ ఆరోగ్య సంస్థలో సలహా మండలిని ఏర్పాటు చేయడంతో పాటు సకాలంలో తగిన చర్యలు తీసుకునేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలి. (మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement