వాషింగ్టన్: కరోనా మహమ్మారి(కోవిడ్-19)విజృంభణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)పై ధ్వజమెత్తారు. కరోనా తీవ్రత గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో సంస్థ విఫలమైందని మండిపడ్డారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనా ‘పైప్ ఆర్గాన్(ఒకరకమైన సంగీత సాధనం)గా పనిచేస్తోందని.. మహమ్మారికి పుట్టినిల్లైన చైనా చెప్పిన మాటలే వల్లెవేస్తోందని విమర్శించారు. కరోనా వ్యాప్తిలో డబ్ల్యూహెచ్‌ఓ పాత్రపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. అదే విధంగా వుహాన్ పట్టణంలో ప్రాణాంతక వైరస్ పురుడుపోసుకోవడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పునరుద్ఘాటించారు.(భారీ నష్ట పరిహారం కోరతాం)
ఇందుకు సంబంధించి ఇప్పటికే తమకు కొంత సమాచారం అందిందని.. డబ్ల్యూహెచ్‌ఓ పనితీరు పట్ల సంతోషంగా లేమని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చే అమెరికాను.. అంతర్జాతీయ సంస్థ తప్పుదోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ గురించి డబ్ల్యూహెచ్‌ఓకు నిజాలు ముందే తెలుసా లేదా తెలిసినా తమకు చెప్పలేదా అన్న విషయాలపై తమకు అవగాహన లేదన్నారు. ఏదేమైనా సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని... అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలిసినపుడు వారి ప్రయత్నాలకు కల్లెం వేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏడాదికి దాదాపు 400 నుంచి 500 మిలియన్ డాలర్ల చొప్పున అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు సమకూరుస్తోందన్న ట్రంప్... ఇప్పుడు ఆ సొమ్మును విశ్వసనీయంగా పనిచేసే గ్రూపులకు ముట్టజెప్పుతామే తప్ప డబ్ల్యూహెచ్‌ఓ ఇచ్చే పరిస్థితి లేదన్నారు.(వియత్నాం యుద్ధాన్ని మించి..)
ఇక వైరస్ ఆనవాళ్లు బయటపడిన వెంటనే చైనా తమ దేశం నుంచి బయటకు వెళ్లే అంతర్జాతీయ విమానాలకు అనుమతినిచ్చింది గానీ.. తమ దేశంలోకి ఎవరినీ రానివ్వలేదన్న ట్రంప్.. చైనా చేసిన పని వల్ల ఇటలీ వంటి దేశాల పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలిసిందేనన్నారు. చైనాలోని ఈ పరిణామాలన్నింటిని గమనించి ప్రపంచానికి వైరస్ గురించి డబ్ల్యూహెచ్‌ఓ ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము ముందు జాగ్రత్తగా వ్యవహరించి చైనా నుంచి విమానాలను నిషేధించినందు వల్ల చాలా మంది ప్రజల ప్రాణాలు కాపాడుకోగలిగామని వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైన నేపథ్యంలో సరికొత్త ప్రతిపాదనలతో ముందుకు వస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేసిన ట్రంప్.. అందుకు ప్రత్యామ్నాయంగా వేరే సంస్థను తెరమీదకు తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment