జెనీవా: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమిష్టిగా కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తిన వేళ అమెరికా, చైనా నిజమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు తావివ్వకూడదని హితవు పలికారు. చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి ఎన్నడూ లేనంతగా వణికిపోతోంది. రోజురోజుకీ కరోనా బాధితులు, మృతుల సంఖ్య పెరుగతుండటంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అధికార రిపబ్లికన్లు చైనాపై విరుచుకుపడుతున్నారు.(డబ్ల్యూహెచ్‌ఓను హెచ్చరించిన ట్రంప్!)
ఈ క్రమంలో వైరస్ గురించి చైనా నిజాలను దాచిందని.. ఆ దేశానికి డబ్ల్యూహెచ్‌ఓ కూడా మద్దతుగా నిలుస్తోందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమకూరుతున్న నిధుల్లో సింహభాగం తమదేనని.. సంస్థ తీరు ఇలాగే ఉంటే ఫండింగ్ ఆపేస్తామని ట్రంప్ హెచ్చరించారు. వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని విమర్శలు గుప్పించారు. డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహణలో చైనా అందిస్తున్న తోడ్పాటు అంతగొప్పగా ఏమీ లేదని.. అయినప్పటికీ ఆ దేశాన్ని వెనకేసుకురావడం సరైన పద్ధతి కాదని ట్రంప్ హితవు పలికారు. అందుకే నిధుల కేటాయింపుపై పునరాలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.(ఈ మేలు మర్చిపోము: ట్రంప్)
కాగా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించి టెడ్రోస్.. మహమ్మారిపై పోరులో డబ్ల్యూహెచ్‌ఓ తన వంతు సహాయాన్ని చేయడంలో ముందువరుసలో ఉందని పేర్కొన్నారు. తమకు అమెరికా నిధులు నిలిపివేస్తుందని భావించడం లేదన్నారు. ఈ సంప్రదాయం కొనసాగుతుందని.. తమకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా 2019 ఏడాదికి గానూ అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు 400 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ వెబ్‌సైట్‌లో కూడా తమ బడ్జెట్‌లో 15 శాతం మేర అమెరికానే సమకూర్చిందని పేర్కొంది.(మరణాలు తక్కువగానే ఉంటాయేమో)
Comments
Please login to add a commentAdd a comment