గుండెలు అదిరిపోయాయ్
ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఆప్ఘనిస్తాన్‌లోని మోమండ్ వ్యాలీలో అమెరికా వాయుదళం జార విడిచిన 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్' పేలుడు శబ్దానికి తమ గుండెలు అదిరిపోయాయని ఆప్ఘాన్ పౌరులు తెలిపారు. బాంబు పేలిన ప్రాంతం నుంచి 58 కిలోమీటర్ల దూరం వరకూ శబ్దం వినిపించింది. బాంబు పేలుడు శబ్దానికి ఇంటి డోర్లు, కిటికీలు ఊగిపోయాయని, ఇల్లు కూలిపోతుందేమోనని భయభ్రాంతులకు గురైనట్లు వివరించారు.
బంధువులు ఎలా ఉన్నారంటూ ఒకరికి ఒకరు ఫోన్ చేసుకున్నారని చెప్పారు. బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో చాలా మంది ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు. కొంతమంది మాత్రం అక్కడే ఉన్నారని పేలుడు తర్వాత వాళ్లను చూడాలని ఉన్నా అక్కడికి వెళ్లే పరిస్ధితి లేదని వాపోయారు. పేలుళ్లలో పౌరులు ఎవరూ చనిపోలేదనే వార్త కొంత ఊరటనిచ్చిందని చెప్పారు.