అఫ్గాన్‌పై 9,720 కిలోల బాంబు
అతిపెద్ద బాంబుతో అమెరికా దాడి
వాషింగ్టన్: ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’(ఎంఓఏబీ)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును అమెరికా గురువారం ప్రయోగించిగంది. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ సొరంగాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల సమయంలో నంగర్‌హర్ రాష్ట్రం అచిన్ ప్రాంతంలో ఖొరాసన్ సొరంగంపై 9,720 కిలోల బాంబును అమెరికా యుద్ధ విమానం (ఎంసీ–130) జారవిడిచింది. జీబీయూ–43బీ పేరున్న ఈ ఎంఓఏబీని యుద్ధ కేత్రంలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పెంటగన్ ప్రతినిధి ఆడమ్ స్టంప్ తెలిపారు.
బాంబు ప్రయోగించే సమయంలో సాధారణ పౌరులకు నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ చెప్పారు. అఫ్గాన్‌లోని ఐసిస్‌ను ఓడించేందుకు కొనసాగుతున్న దాడుల్లో భాగంగానే ఈ బాంబును ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు వెల్లడించారు. నిజానికి ఎంఓఏబీ అంటే ‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్’ అని అర్థం. 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో ఈ బాంబు తయారుచేసినా ఇంతవరకూ వినియోగించలేదు. ఈ బాంబు తయారుచేసిన కొద్ది కాలానికే ఎంఓఏబీ కంటే శక్తివంతమైన ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్’ను రష్యా తయారుచేసింది.