ప్రతీకాత్మక చిత్రం
రోమ్: మహమ్మారి కరోనా(కోవిడ్-19) ధాటికి అతలాకుతలమైన దేశాల్లో ఇటలీ ఒకటి. దాదాపు 6 కోట్ల జనాభా ఉన్న ఈ యూరప్ దేశంలో 33 వేల మందికి పైగా మహమ్మారికి బలైపోయారు. ప్రాణాంతక వైరస్ సోకి మరణించిన వారికి అంత్యక్రియలు సైతం నిర్వహించలేని దుర్భర పరిస్థితులు ప్రజలను కలవరపెట్టాయి. ఇక ప్రస్తుతం అక్కడ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నెలల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. అయితే కరోనాకు ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశం ఉందని మిలాన్‌లోని హుమానిటస్ పరిశోధనాసుపత్రి ఇంటెన్సివ్ కేర్ విభాగం అధిపతి మౌరిజియో చెకోని హెచ్చరించారు. ప్రజలు వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని.. ఒకవేళ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగినట్లయితే మరోసారి లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వానికి సూచించారు. (కరోనా సామర్థ్యం తగ్గిపోయింది)
కాగా బ్రిటీష్- ఇటాలియన్ పౌరుడైన చెకోని.. లండన్‌లోని సెయింట్ జార్జ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో 14 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు. అతిపిన్న వయసులోనే నేషనల్ హెల్త్ సర్వీస్ కన్సల్టెంట్‌గా 2008లో నియమితులయ్యారు. ఈ క్రమంలో యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు(హెల్త్‌కేర్ ఆర్మీ- దాదాపు 10 వేల స్పెషలిస్టులు ఒక్కటిగా చేర్చే సొసైటీ) చేపట్టిన చెకోని.. చైనాలో కరోనా వ్యాపించిన తొలినాళ్లలోనే యూరప్ దేశాలను అప్రమత్తం చేశారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సహచర వైద్యులతో కలిసి పలు సూచనలు చేశారు. కరోనా సంక్షోభంతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు యూరప్ దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో తాజాగా చెకోని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. (కరోనా వైరస్ ఇంకా ప్రాణాంతకమే : డబ్ల్యూహెచ్‌ఓ)
అది చాలా ప్రమాదకరం
‘‘యూరోపియన్ వైద్యాధికారులు వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయగలరని నమ్ముతున్నాం. అయితే ట్రాన్స్‌మిషన్ కేసుల్లో పెరుగుదల నమోదైతే మరోసారి కఠిన నిబంధనలు విధించకతప్పదు. ఇక ‘సామూహిక రోగ నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ- జనాభాలో దాదాపు70% మంది ఆ వ్యాధిన పడి కోలుకుంటే ఇది సాధ్యమవుతుంది) వ్యూహమనేది ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే కరోనాకు ఇంతవరకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఇప్పుడు బలహీనవర్గాలకు వైరస్ సోకకుండా చూసుకోవడమే మన ముందున్న మార్గం’’ అని చెకోని చెప్పుకొచ్చారు.
అత్యవసరంగా సమావేశమయ్యాం
ఇక కరోనా వ్యాపించిన తొలినాళ్ల గురించి చెకోని మాట్లాడుతూ.. ముప్పయేళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడని.. కొన్ని రోజుల తర్వాత అతడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి అతడికి చికిత్స అందించడంతో పాటుగా.. వైరస్ వ్యాప్తి గురించి అధికార వర్గాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. లాంబార్డీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వైరస్ తీవ్రత గురించి చర్చించామన్నారు. అనంతరం వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల సామర్థ్యం పెంచడంతో పాటుగా.. వెంటిలేటర్లు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా స్థానిక ఆస్పత్రులకు సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు.
రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి
కాగా కరోనా పేషెంట్లకు చికిత్స అందించే క్రమంలో హెల్త్‌వర్కర్లు ఎంతో కఠినశ్రమకోర్చారన్న చెకోని.. పీపీఈ ధరించడం, తొలగించడం వారికి అన్నిటికంటే పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. అయినప్పటికీ రోజుల తరబడి రోగులకు సేవలు చేస్తూ.. ఇంటికి దూరంగా ఉంటూ అంకితభావాన్ని కనబరిచారని కొనియాడారు. కరోనా సృష్టించిన కల్లోలాన్ని తలచుకుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయని.. ఎన్నెన్నో హృదయవిదారక ఘటనలకు మహమ్మారి కేంద్ర బిందువుగా మారిందని గుర్తుచేసుకున్నారు. ప్రాణాంతక వైరస్ ఎప్పుడు చనిపోతామో తెలియక రోగులు అల్లాడుతుంటే.. ఓ పక్క వారికి ధైర్యం చెబుతూ... మరోపక్క వారి కుటుంబ సభ్యులను సముదాయిస్తూ అనేక మంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రజలకు తామున్నామనే భరోసా ఇచ్చారంటూ ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment