
కుటుంబంతో ఇవాంకా
సాక్షి, హైదరాబాద్: ‘నేనొక భార్యను.. తల్లిని.. చెల్లిని.. బిడ్డను.. ఆ తర్వాతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను, ప్రభుత్వ సలహాదారును..’.. ఇవాంకా ట్రంప్ ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో తనకు తానుగా చేసుకున్న పరిచయం ఇది. అచ్చంగా తన పరిచయానికి తగినట్లుగానే ఉన్న ఇవాంకా నడక, నడవడి ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నట్లుగానే ఆమె తీరు కనిపించింది. మొత్తంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదిక మీద అగ్రరాజ్య మహిళా దిగ్గజంలా కాకుండా.. అందరినీ కలుపుకొని పోతూ, సాధారణ మహిళగానే కనిపించింది. మోముపై చెదరని చిరునవ్వుతో అతిథులను పలకరించటంతోపాటు వేదికపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మాట్లాడినప్పుడు అందరి కంటే ముందుగా ఆమెనే చప్పట్లు కొట్టడం కనిపించింది. తను ప్రసంగిస్తున్నప్పుడు సైతం తనకు తానుగా సంబరపడిపోవటం, చప్పట్లు కొడుతూ ఆనందపడటం వంటివాటితో ఆమె ప్రసంగం ‘బోల్డ్ లైక్ ఏ చైల్డ్ (తన శక్తికి మించిన పనిచేసి.. పెద్దవాళ్ల మెప్పుకోసం చూసే చిన్న పిల్లల మాదిరి..)’లా సాగిందని సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు పేర్కొనడం గమనార్హం. అమెరికాతో మన దౌత్య సంబంధాల గురించి ప్రస్తావించినా.. మహిళలకు సంబంధించి స్ఫూర్తి కలిగించే మాటలు చెప్పినా.. ఆగి మరీ ప్రేక్షకుల నుంచి స్పందన కోరుకోవడం, చప్పట్ల రూపంలో అభినందనలు అందితే మురిసిపోవడం వంటివన్నీ ఇవాంకా ప్రసంగంలో ఆకట్టుకున్నాయి.
మచ్చుకైనా కనిపించని ఆడంబరం..
‘మిత్ర’రోబోతో మీట నొక్కి సదస్సును ప్రారంభించిన సందర్భంలోనూ ఇవాంకా మురిసిపోయింది. ‘భలే బాగుందం’టూ పిల్లలు ఆనందపడ్డట్లుగా అనిపించింది. జీఈఎస్‌కు సంబంధించిన నృత్య ప్రదర్శన, జయహో పాటతో ప్రదర్శించిన థీమ్ సాంగ్, లేజర్ డ్యాన్స్‌ను చూసినంత సేపూ అదే ఆనందం. ప్రపంచ సదస్సుకు అమెరికా ప్రతినిధిగా వచ్చిన ఆడంబరం కంటే.. సాదాసీదాగా సభకు వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తగానే ఇవాంకా వ్యవహరించినట్లు అనిపించింది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలసినప్పుడుగానీ, ఇతర మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నప్పుడుగానీ ఆమె ఆహార్యం, మాటతీరు ఎవరో స్నేహితులు, బంధువులతో వ్యవహరించినంత సాదాగా కనిపించింది. మర్యాదగా, గౌరవంగా, అన్నింటికీ మించి స్నేహపూర్వకంగా.. వ్యవహరించింది. అందుకే ‘షీ ఈజ్ మోర్ లైక్ ఎ చైల్డ్’.. ట్వీటర్, ఫేస్‌బుక్‌లో తనకు తానుగా చెప్పుకున్న పరిచయాన్ని సదస్సులో కళ్లకు కట్టినట్లుగా చూపారనే చెప్పొచ్చు.
రాయల్ గ్రీన్.. వైబ్రెంట్ వైలెట్.. రేడియంట్ రెడ్..
జీఈఎస్‌లో ఇవాంకా ధరించిన వస్త్రాలు అందరినీ ఆకర్షించాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన సమయంలో నలుపు రంగు డ్రెస్‌లో చాలా సింపుల్‌గా కనిపించారు. జీఈఎస్ సమావేశం ప్రారంభానికి రాయల్ గ్రీన్ రంగు సిల్క్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. దాని మీద పసుపు, గులాబీ రంగుల్లో ఉన్న పూల డిజైన్లతో పూర్తి విభిన్నమైన లుక్ వచ్చింది. ఈ డ్రెస్ జపాన్ మహిళలు సాంప్రదాయంగా వేసుకునే ‘కిమోనో’డ్రెస్‌ను గుర్తుకుతేవడం గమనార్హం. ఇక ఫలక్‌నుమాలో విందుకు హాజరైన సమయంలో ఇవాంకా ఉదారంగు (వైబ్రెంట్ వయోలెట్)లో ప్రకాశవంతమైన గౌన్ వేసుకున్నారు. హైనెక్, ఫుల్ స్లీవ్స్‌కు తోడు ముడుచుకున్న సిగతో హుందాగా కనిపించారు. రెండో రోజున జీఈఎస్ సమావేశానికి ఆకర్షణీయంగా ఉన్న ఎరుపు రంగు (రేడియంట్ రెడ్) డ్రెస్ వేసుకున్నారు. మొదటి రోజుకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నానని చెప్పడానికి ఆ రంగును ఎంచుకున్నారో.. మరేమోగానీ మొదటి రోజుకన్నా బాగా ఉత్సాహంగా కనిపించారు. కేటీఆర్, చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్‌లతో చర్చాగోష్టిలో ఉత్సాహం కనిపించింది. ఫలక్‌నుమా విందుకు హాజరైనప్పుడు మినహా మిగతా స మయంలో ఇవాంకా జుట్టును లూజుగా వదిలేసే ఉన్నారు. విందులో మాత్రం సిగ ముడుచుకున్నారు. ఇవాంకా ఆభరణాలకు అంత ప్రాధాన్యమేమీ ఇవ్వకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment