నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది!
-
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు
-
బయట గుక్కచేత భంగపడును
-
స్థానబలముగాని తన బలిమికాదయా
-
విశ్వదాభిరామ వినురవేమ
అనేది వేమన శతకంలో పద్యం. సాధారణంగా నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి బలం చాలా ఎక్కువగా ఉంటుందని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అంటారు. కానీ అది కూడా తప్పేనని తేలిపోయింది. నీళ్లలో ఉన్న ఓ మొసలిని చిరుతపులి వెంటాడి.. వేటాడి మరీ దాని తల పట్టుకుని కొరికి చంపేసి మరీ గట్టుమీదకు లాక్కొచ్చింది. బ్రెజిల్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ దృశ్యం కెమెరా కంట పడింది. చిరుత పులులను 'కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్' అంటారు. ఆకలిగా ఉన్నప్పుడు ఇవి ఎంతటి సాహసమైనా చేస్తాయి. అచ్చం అలాంటి పరిస్థితిలోనే ఉన్న ఓ బలమైన చిరుత పులి.. ఎక్కడ చూసిందో గానీ నీళ్లలో ఉన్న మొసలిని చూసింది. అమాంతం దానిమీదకు దూకి, నోటితో దాని తల వెనక భాగంలో గట్టిగా కొరికి పట్టుకుని, ఒడ్డు మీదకు తీసుకొచ్చేసింది.
చివరి నిమిషంలో చిరుతను గమనించిన మొసలి వేగంగా ఈదుకుంటూ వెళ్లిపోడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం దక్కలేదు. అయితే, దాడి చేసి మొసలిని చంపింది ఆడ చిరుత కాగా.. అందులో చాలా భాగాన్ని మగ చిరుత కూడా పంచుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. చిరుత పులికి ఎలా దాడి చేయాలన్న విషయం బాగా తెలుసు. మొసలి తల వెనుక భాగం చాలా బలహీనంగా ఉంటుంది. సరిగ్గా అక్కడ దాడి చేస్తే అది కోలుకునే అవకాశం లేదు. ఆ విషయాన్ని తెలుసుకున్న చిరుత అలాగే దాడి చేసిందని అంటున్నారు.