వంటకాలతో వందకోట్ల టర్నోవర్..
భోజన ప్రియులను విభిన్న రకాల వంటకాలతో ఆకట్టుకున్న ఓ వ్యాపారి ఏకంగా కోట్లకు పడగలెత్తాడు. చవులూరించే రుచులతో ఆన్ లైన్ లో అందరినీ ఆకట్టుకునేందుకు కుక్ ప్యాడ్ వెబ్సైట్ ను స్థాపించి.. ఇప్పుడు ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పే జపాన్ లో జపనీస్ పారిశ్రామికవేత్త అకిమిస్తు సానో.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంప్రదాయ ప్రాంతీయ జపనీస్ ప్రత్యేక వంటకాలలు భోజన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రిల్డ్ స్క్విడ్, పాన్ కేక్స్ తో పాటు... చీజ్ కేక్, పాస్తా, బోలోగ్ నీస్ వంటి 2.1 మిలియన్ల అన్యదేశ వంటకాలతో 58.8 మిలియన్ల వినియోగదారులతో 'కుక్ ప్యాడ్' కొనసాగుతోంది.
జపనీయులు ఇంటి భోజనాన్ని ఆస్వాదించేందుకు రకరకాల రుచులను అందిస్తున్న కుక్ ప్యాడ్.. జపాన్ లో అత్యంత ఎక్కువమంది వీక్షించే వెబ్పైట్లలో 55వ స్థానంలో ఉంది. గత ఏడు సంవత్సరాల్లో ఈ సంస్థ పన్నెండు రెట్లు విస్తరించింది. ఇంచుమించుగా జపాన్ మహిళల్లో సుమారు ఇరవైనుంచి ముఫ్ఫై సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో సగంకంటే ఎక్కువ మంది కుక్ ప్యాడ్ ను సందర్శిస్తుంటారు. 1997 లో సానో స్థాపించిన ఈ కుక్ ప్యాడ్..ఎంతో ప్రజాదరణ పొంది 2009 నాటికి 80శాతం రెవెన్యూ పెంచుకుంది. గతేడాది 65 మిలియన్ డాలర్ల కు చేరిన రెవెన్యూ సుమారు 19 మిలియన్ డాలర్ల లాభాలను మిగుల్చుకుంది. గత నెల దీని షేర్లు కూడ 20 శాతం పెరిగి, కంపెనీలో సానో వాటాను 44శాతానికి పెంచడంతోపాటు... కంపెనీ మొత్తం విలువ వంద కోట్లకు చేరింది.
అత్యంత అరుదుగా మీడియా ముందుకు వచ్చే 42ఏళ్ళ సానో... జపాన్ కీయో విశ్వవిద్యాలయంలో పట్టభద్రత పొంది కుక్ ప్యాడ్ లో పని ప్రారంభించాడు. 2012 లో అక్కడ సీఈవో పాత్రను వదిలిన సానో... ఆ తర్వాత ఆదాయ సముపార్జనపై దృష్టి సారించాడు. మనానో వెడ్డింగ్ పేరిట ఉన్న జపనీస్ వివాహ వేదిక రివ్యూ సైట్ ను, కుకుంబర్ టౌన్ అనే ఆమెరికాకు చెందిన ఓ ఆహార బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేసి, ఈ సంవత్సరంలో లెక్కలేనంత ఆదాయాన్ని చేజిక్కించుకున్నాడు.
పూర్వం చదువు లేకుండానే వంట జ్ఞానాన్ని ఎలా పొందారో తెలియదుకానీ, ఇప్పటి వారు వంటలు చేసేందుకు ఏమాత్రం ఇష్టం చూపించడం లేదని, అయితే రుచికరమైన వంటకాలు కుటుంబాలను సమష్టిగా ఉంచేందుకు ఎంతో సహకరిస్తాయని సానో గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సానో..అతని భార్య వారి కెంపెనీ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఓ చిన్నపాటి పరిశ్రమలా కనిపించే సంప్రదాయ పాకశాలలో(వంటిల్లు) ప్రతిరోజూ విధిగా ఉద్యోగులకు స్వయంగా వండి పెడుతుంటారట. అంతేకాక సానో తనకు కావలసిన, సమీప బంధువులు వండిన వంటకాలనే భుజిస్తాడని కూడా అతని గురించి బాగా తెలిసినవారు చెప్తుంటారు.