టోక్యో : సిరియా మిలిటెంట్ల నిర్బంధంలో మూడేళ్లుగా చిత్రహింసలు అనుభవించిన జపనీస్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు జుంపై యసుదాకు విముక్తి లభించింది. సిరియా అంతర్యుద్ధంలో పౌరులు అనుభవిస్తున్న బాధలను ప్రపంచానికి తెలియజేసేందుకు యసుదా సహా మరో ఇద్దరు జపాన్ జర్నలిస్టులు 2015లో అక్కడికి వెళ్లారు. అయితే జుంపై కార్యకలాపాలను పసిగట్టిన ఉగ్రమూకలు అతడిని నిర్బంధించాయి. ఈ విషయం తెలుసుకున్న తోటి జర్నలిస్టులు ఆయనను విడిపించేందుకు ప్రయత్నించడంతో వారి తల నరికి అత్యంత దారుణంగా హతమార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో జుంపై కూడా మరణించి ఉంటాడని అంతా భావించారు. అయితే ఉగ్రవాదులు జుంపైని మాత్రం ప్రాణాలతోనే ఉంచి నానా రకాలుగా వేధించి కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.
ఈ క్రమంలో జుంపై దక్షిణ టర్కీకి చేరుకోగా.. అక్కడి అధికారులు జపాన్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. జపాన్ నుంచి వెళ్లిన అధికారులు జుంపై తమ దేశ పౌరుడేనని నిర్ధారించారు. దీంతో గురువారం టర్కీ నుంచి బయల్దేరిన జుంపై ఎట్టకేలకు జపాన్ చేరుకున్నాడు. ఈ విషయంసై స్పందించిన జపాన్ ప్రధాని షింజో అబే టర్కీ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. కాగా జుంపై మిలిటెంట్ల చేతిలో చిక్కడం ఇదే మొదటిసారి కాదు. 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో మూడు రోజుల పాటు మిలిటెంట్ల చేతుల్లో బంధీగా ఉన్నారు. ఆ సయమంలో తన అనుభవాలిన్నింటినీ కలిపి ‘యసుద ఈజ్ టఫ్’ అనే పుస్తకాన్ని రాశారు. జపాన్ చేరుకున్న అనంతరం మాట్లాడుతూ.. మూడేళ్ల తర్వాత నరకం నుంచి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. అయితే జుంపై తిరిగిరావడం పట్ల జపాన్ పౌరుల స్పందన మిశ్రమంగా ఉంది. చెప్పినా వినకుండా మాటిమాటికీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న జుంపైని విడిపించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటూ కొంతమంది విమర్శిస్తుండగా.. మరికొంత మాత్రం తమ సానుభూతి తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment