ఎగిరే కారు
కార్లకు రెక్కలు వచ్చేందుకు... నిలువుగా పైకెగరి గమ్యంవైపు దూసుకెళ్లేందుకు ఇంక ఎక్కువ రోజులు పట్టదు. ఎందుకంటారా? ఇప్పటికే కొన్ని ఎగిరే కార్లు మార్కెట్‌లోకి వచ్చేసేందుకు సిద్ధమవుతూండగా.. జెట్‌ప్యాక్ ఏవియేషన్ అనే సంస్థ తాజాగా ఫొటోలో చూపినట్టు ఇంకో దాన్ని సిద్ధం చేస్తోంది మరి. మనుషులు నిలువుగా పైకి ఎగరేలా చేసేందుకు జెట్‌ప్యాక్‌ను సిద్ధం చేసింది ఈ కంపెనీనే. విషయం ఏమిటంటే.. ఒకవైపు బ్యాటరీల సామర్థ్యం పెరిగిపోతోంది. ఇంకోవైపు సెన్సర్లు, ఎలక్ట్రిక్ మోటర్ల ఖరీదు తగ్గిపోతోంది.
ఒకప్పుడు అందుబాటులో లేని అనేక టెక్నాలజీలు ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో జెట్ ఏవియేషన్స్ ఎగిరే కారు తయారీకి నడుం బిగించింది. మొత్తం ఆరు రోటర్లతో కూడిన ఈ ఎగిరే కారులో ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేస్తుంది. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని తయారు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఐదేళ్లలో ఈ సరికొత్త ఎగిరే కారు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.