బీజింగ్: కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు అంగీకరించిన అనంతరం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి చైనాలో పర్యటిస్తున్నారు. అణు నిరాయుధీకరణలో భాగంగా తదుపరి కార్యాచరణపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు ఆయన చైనా వచ్చారు. ఈ ఏడాది మార్చి నుంచి కిమ్ చైనాలో పర్యటించడం ఇది మూడోసారి.
అయితే గత రెండు పర్యటనలు రహస్యంగా సాగగా, ఈసారి మాత్రం కిమ్ బీజింగ్‌లో విమానం దిగగానే చైనా ఆ విషయాన్ని బహిర్గతం చేసింది. ఇటీవల సింగపూర్‌లో కిమ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యి, అణ్వాయుధాలను త్యజించేందుకు ఒప్పుకోవడం తెలిసిందే. మరోవైపు దిగుమతి సుంకాన్ని ముందు అమెరికా, ఆ తర్వాత చైనాలు పెంచడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో కిమ్ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
‘సింగపూర్’ వివరాలు పంచుకున్న కిమ్
రెండు రోజుల పర్యటన కోసం చైనా చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం జిన్‌పింగ్‌తో భేటీ అయ్యి.. సింగపూర్‌లో తాను ట్రంప్‌తో జరిపిన చర్చల గురించి వివరించారని ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. అలాగే చైనా–ఉత్తర కొరియా సంబంధాల బలోపేతం, కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుత పరిస్థితులపై వారు మాట్లాడుకున్నారని తెలిపింది. అంతకుముందు ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’ వద్ద కిమ్‌కు జిన్‌పింగ్ స్వాగతం పలికారు.
‘కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వాలను నెలకొల్పడంలో చైనాది ముఖ్య పాత్ర. శాంతి స్థాపన కోసం చైనాతోపాటు సంబంధిత అన్ని దేశాలతో కలసి పనిచేయాలనుకుంటున్నాం’ అని కిమ్ జిన్‌పింగ్‌కు వివరించినట్లు ఓ టీవీ చానల్ తెలిపింది. సింగపూర్ శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అమెరికా, ఉత్తర కొరియాలు కట్టుబడి, మెరుగైన ఫలితాన్ని సాధించాలని జిన్‌పింగ్ సూచించారంది. కాగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ కిమ్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment