లాస్ ఏంజిల్స్ చరిత్రలో.. పెద్ద ప్రమాదం..
సాక్షి, లాస్ ఏంజిల్స్: లా ట్యూనా కెనియన్‌లో చెలరేగిన కార్చిచ్చు శనివారం రాత్రి ఉత్తర లాస్ ఏంజిల్స్ నగరాన్ని వణికించింది. గత రెండు రోజులుగా ఐదు వేల ఎకరాల అటవీ ప్రాంతం కార్చిచ్చు ధాటికి కాలి బూడిదైనట్లు లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. కార్చిచ్చుకు 'లా ట్యూనా ఫైర్' అని నామకరణం చేసినట్లు వెల్లడించింది.
మంటల కారణంగా గాలి ఉష్ణోగ్రత మూడు అంకెలను దాటడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. బర్బాంక్‌లో 300, గ్లెండాల్‌లో 250, లాస్ ఏంజిల్స్‌లో 180 ఇళ్లను ఖాళీ చేయించినట్లు వివరించింది. లాస్ ఏంజిల్స్ నగర చరిత్రలో అత్యంత పెద్ద ప్రమాదం ఇదేనని తెలిపింది. గాలి ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణం అవుతోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.