ముగ్గురు నల్లగొండవాసుల సజీవదహనం! | Teenage siblings from Telangana die in US fire accident | Sakshi
Sakshi News home page

ఆశలు ఆహుతి!

Published Thu, Dec 27 2018 1:17 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Teenage siblings from Telangana die in US fire accident - Sakshi

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాద దృశ్యం , కుటుంబ సభ్యులతో (ఫైల్‌)

భవిష్యత్తుపై ఎన్నో కలలతో ఆ ముగ్గురూ అమెరికాలో అడుగుపెట్టారు... చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు, సొంతూరికి మంచి పేరు తేవాలనుకున్నారు. క్రిస్మస్‌ సెలవులు కావడంతో పరిచయస్తుల ఇంటికి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు వెళ్లారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. క్రిస్మస్‌ పండుగే వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. అగ్నిప్రమాదం రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. కన్నవాళ్ల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. 

చందంపేట/వాషింగ్టన్‌: అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో ఉన్న ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు టీనేజర్లు సహా నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొలిరివిల్లే ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఆదివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) క్రిస్మస్‌ వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఇంటిని మంటలు చుట్టుముట్టాయి. తప్పించుకునే వీల్లేకపోవడంతో నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన సాత్విక (18), సుహాస్‌ నాయక్‌ (16), జై సుచిత (14)తోపాటు ఇంటి యజమానురాలు కేరీ కోడ్రియట్‌ (46) సజీవదహనమయ్యారు. మృతుల కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్రపు తండాకు చెందిన కేతావత్‌ శ్రీనివాస్‌ నాయక్, సుజాత దంపతులు గ్రామంలో ‘అలితేయా’క్రిస్టియన్‌ మిషనరీ ఆశ్రమంతోపాటు స్కూల్, హాస్టల్‌ నిర్వహిస్తూ 450 మందికి విద్యనందిస్తున్నారు.

శ్రీనివాస్‌ నాయక్‌ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు సాత్విక, జై సుచిత, కుమారుడు సుహాస్‌ నాయక్‌ ఉన్నారు. నాయక్‌ కుటుంబానికి అమెరికాలోని కొలిరివిల్లే బైబిల్‌ చర్చిలో భాగస్వామ్యం ఉంది. దీంతో ఆ చర్చి నడుపుతున్న పాస్టర్‌ డేనియల్‌ సాయంతో నాయక్‌ తన పిల్లలను మిస్సిసిపీలోని ఫ్రెంచ్‌ క్యాంప్‌ అకాడమీలో చదివిస్తున్నారు. అకాడమీకి క్రిస్మస్‌ సెలవులు ప్రకటించడంతో పిల్లలు డేనియల్‌ ఇంటికి గెస్ట్‌లుగా వెళ్లారు. ఆదివారం రాత్రి క్రిస్మస్‌ వేడుకల్లో వారు నిమగ్నమై ఉండగా షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని సాత్విక, సుహాస్, జై సుచితతోపాటు కేరీ కోడ్రియట్‌ మరణించగా కేరీ భర్త డేనియల్, ఆమె చిన్న కుమారుడు కోల్‌ (13) మాత్రం కిటికీలోంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. ప్రమా దవార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన న ష్టం జరిగిపోయింది. పిల్లల మరణవార్త సమాచారం అందడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్‌ నాయక్, సు జాత హుటాహుటిన అమెరికా పయనమయ్యారు.  

కేటీఆర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే... 
అమెరికాలో ముగ్గురు టీనేజర్ల మరణవార్త తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ గుర్రపుతండాకు చేరుకొని మృతుల బంధువులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వారి మృతదేహాలు సాధ్యమైనంత త్వరగా దేశానికి తీసుకొచ్చేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కేటీఆర్‌ను కోరారు. మృతుల కుటుంబాలకు కేటీఆర్, ఎమ్మెల్యే ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 

ఊరంటే ప్రాణం 
ఊరంటే ముగ్గురు పిల్లలకూ ప్రాణం. ఎప్పుడొచ్చినా వారంపాటు ఉండేవారు. వారు దాచుకున్న డబ్బులతో ఈ స్కూల్‌లో చదివే పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, కొత్త దుస్తులు కొనిచ్చేవారు. 
– కేతావత్‌ చంద్రునాయక్, పిల్లల పెదనాన్న 

వీడియో కాల్‌లో మాట్లాడేవారు 
వారానికి ఒకసారి వాళ్ల చిన్నమ్మలు, పెదనాన్నలందరితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడే వారు. నాకు ఫోన్‌ లేకుంటే వాళ్లే పెద్ద ఫోన్‌ కొనిచ్చారు. వాళ్లు ఇక లేరంటే నమ్మశక్యం కావడం లేదు. 
 – సామ్య నాయక్, పెదనాన్న 

తమ్ముడు, చెల్లెలిని చూడాలని ఉంది 
తమ్ముడు, చెల్లెలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం వచ్చాక మా అందరినీ అమెరికాకు తీసుకెళ్తామని చెప్పేవారు. చిన్న వయసులోనే వారిని తీసుకెళ్లిపోయిన దేవుడికి మనసెలా ఒప్పిందో అర్థం కావట్లేదు. 
– సుమలత, సోదరి 

నమ్మలేకపోతున్నాం.. 
ముగ్గురు పిల్లలూ హైదరాబాద్‌లో ఉన్నా, అమెరికాలో ఉన్నా వారానికి ఒకసారి ఫోన్‌ చేసి మాట్లాడే వారు. అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకునే వారు. వారు చనిపోయారంటే నమ్మలేకపోతున్నాం. 
– చిన్నారుల పెద్దమ్మలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement