దాడిలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు
జలాలాబాద్: రంజాన్ రోజు అఫ్గానిస్తాన్ నెత్తురోడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రజలు, తాలిబన్ ఫైటర్లు కలిసి జరుపుకున్న వేడుకలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 21 మంది మృతిచెందగా 41 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువ మంది తాలిబన్లే ఉన్నారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిబన్‌లతో సర్కారు కుదర్చుకున్న కాల్పలు విరమణ ఒప్పందం ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ప్రభుత్వ ఒప్పందం నేపథ్యంలో అఫ్గాన్ భద్రతా దళాలతో కలిసి తాలిబన్ ఫైటర్లు, ప్రజలు ఆలింగనాలు చేసుకోవడం, సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడిపిన కాసేపటికే ఈ దాడి జరిగింది.
దాడిని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ మూడ్రోజుల కాల్పుల విరమణకు తాలిబన్ నాయకుడు హైబతుల్లా అఖున్‌జాదా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది గురువారం నుంచి ఆదివారం వరకు అమల్లో ఉంది.ఈ ఘటనకు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్గాన్‌లో శాంతిస్థాపన కోసం అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలకు కొంతకాలంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే.. కాల్పుల విరమణకు తాలిబాన్లు అంగీకారం తెలిపారు. ఇంతలోనే తాలిబన్లు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment