ఐర్లండ్ ప్రధానిగా భారత్ సంతతి నేత
► అధికార పార్టీ ఎన్నికల్లో లియో వారడ్కర్ గెలుపు
► తొలి ‘గే’, పిన్నవయస్కుడైన ప్రధానిగా రికార్డు
డబ్లిన్: ఐర్లండ్ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వారడ్కర్ (38) ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధాని ఎండా కెన్నీ రాజీనామాతో జరిగిన అధికార ఫైన్ గేల్ పార్టీ అంతర్గత ఎన్నికలో 60 శాతం ఓట్లతో వారడ్కర్ గెలిచారు. ఐర్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన, తొలి మైనార్టీ ప్రధానిగా నిలిచారు. తొలి స్వలింగ సంపర్క (గే) ప్రధానిగానూ రికార్డులకెక్కారు.
ప్రధాని పదవికి పార్టీ సీనియర్ నేత సిమన్ కోవెనీ, వారడ్కర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానిగా ఎంపికవటంపై వారడ్కర్ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను సగం భారతీయుడిని, డాక్టర్‌ను, గే పాలిటీషియన్‌ని మాత్రమే కాదు. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుంది’ అని అన్నారు. జూన్ 13న జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకోనున్నారు.
ముంబైలో మూలాలు..
ముంబై నుంచి వచ్చి స్థిరపడిన హిందూ, మçహారాష్ట్రీయుడైన డాక్టర్ అశోక్ వారడ్కర్, ఐరిష్ నర్స్ మీరియమ్ మూడో సంతానమే లియో. 66 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో టీషక్ (ప్రధాని) పదవికి ఆసియా మూలాలున్న ‘గే’ను ఎన్నుకోవడం పదేళ్ల కిందటి వరకు ఊహకు అందని విషయం. వారడ్కర్.. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీలో మొదట లా కోర్సులో చేరినా, వెంటనే మెడిసిన్‌కు మారారు. 2003లో మెడిసిన్ పూర్తిచేశారు. అదే ఏడాది ఫింగల్ కౌంటీ కౌన్సిల్‌కు లియోను ఫైన్ గేల్ పార్టీ కోఆప్ట్ చేయడంతో రాజకీయ ప్రయాణం గాడినపడింది. 2007లో డబ్లిన్ వెస్ట్ స్థానం నుంచి ఐర్లండ్ దిగువసభకు ఎన్నికై, మంత్రిగా సని చేశారు. కుంభకోణాల ఫలితంగా ప్రధాని కెన్నీ రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది.