అమెరికాలో ఒకే రోజు 2 వేల మంది మృతి | Lostbreath Toll Nears 2000 as Hundreds of COVID-19 Deaths Go Uncounted | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఒకే రోజు 2 వేల మంది మృతి

Published Fri, Apr 10 2020 4:36 AM | Last Updated on Fri, Apr 10 2020 10:13 AM

Lostbreath Toll Nears 2000 as Hundreds of COVID-19 Deaths Go Uncounted - Sakshi

న్యూయార్క్‌లోని కింగ్స్‌బ్రూక్‌ మెడికల్‌ సెంటర్‌లో భద్రపరిచిన కరోనా బాధితుల మృతదేహాలు

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: అది న్యూయార్క్‌ నగరంలో బ్రూక్లిన్‌ అపార్ట్‌మెంట్‌. దాని ఎదురుగానే వైకాఫ్‌ హైట్స్‌ అనే ఆస్పత్రి ఉంటుంది. ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఒక జంట ప్రతీ రోజూ కిటికీలోంచి ఆస్పత్రి వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాని ఎదుట మృత దేహాలను తీసుకువెళ్లడానికి వచ్చే ఏసీ ట్రక్కులు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తుంటే మనసు కలిచి వేస్తోందని అలిక్స్‌ మోంటాలెనె అన్నారు. ఆమె రాయిటర్స్‌ వార్తా సంస్థతో స్కైప్‌లో మాట్లాడారు. ‘‘మా కిటికీ లోంచి బయటకి చూస్తే ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది.

వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. అంటే ఆస్పత్రి లోపల ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. రోజుకు ఎన్ని మృతదేహాలు వస్తున్నాయో లెక్క పెట్టడం మానేశాం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది’’అని చెప్పారు. కరోనా వైరస్‌ ధాటికి న్యూయార్క్‌ అల్లకల్లోలంగా మారింది. కేవలం న్యూయార్క్‌లోనే కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటితే, 6 వేలకి పైగా మరణాలు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్‌–19తో జనం పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో పెద్ద పెద్ద ఏసీ ట్రక్కుల్ని తాత్కాలిక మార్చురీల కింద మార్చేశారు. ఎవరైనా మరణిస్తే వాటిల్లో భద్రపరిచి, తమ వంతు వచ్చినప్పుడు ఖననం చేస్తున్నారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 4.50 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 16 వేలకు చేరింది.   

యువకుల్ని కాటేస్తోంది  
కోవిడ్‌–19 రోగులు కళ్ల ముందే మరణిస్తూ ఉండడంతో వైద్య సిబ్బంది కూడా హడలెత్తిపోతున్నారు. ఏ విపత్తు కూడా అమెరికాను ఈ స్థాయిలో ఇప్పటివరకు వణికించకపోవడంతో ఏం జరుగుతోందో, దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు. ‘మా నగరంలో వైరస్‌ విశ్వరూపం చూపిస్తోంది. ప్రతీ ఒక్కరినీ కాపాడడమే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. వచ్చే రెండు వారాల్లో వైరస్‌ని అదుపులోకి తెస్తాం’ అని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో అన్నారు. ఈ వైరస్‌ కేవలం వృద్ధుల్ని, వేరే వ్యాధులతో బాధపడుతున్న వారినే కాదు, యువకుల్ని కూడా కాటేస్తోంది. ‘అప్పటివరకు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. కోలుకుంటున్నారు కదా అనుకుంటాం. హఠాత్తుగా కళ్ల ముందే తుది శ్వాస విడుస్తున్నారు. యువతీ యువకులు కూడా దీనికి అతీతమేమీ కాదు’అని మౌంట్‌ సినాయ్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు డయానా టోరెస్‌ అన్నారు.  

ఈ అంకెలు గురువారం రాత్రి 11 గంటలకు..
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు: 15,69,002
మరణాలు                             :92,109
కోలుకున్న వారు                    :3,45,917


11 మంది భారతీయులు మృతి
మరో 16 మందికి సోకిన వైరస్‌  
అమెరికాలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. 24 గంటల్లోనే 2 వేల మంది మృతి చెందడం ఆందోళనకు దారి తీస్తోంది. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. మృతి చెందిన వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో 10 మంది పురుషులే. వీరంతా న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన వారు. న్యూయార్క్‌లో మరణించిన భారతీయుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని సమాచారం. ఫ్లోరిడాలో మరొక ఇండియన్‌ చనిపోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు పరీక్షల్లో తేలింది. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఈ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాధిగ్రస్తులు భారత్‌లోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందినవారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు, వివిధ ఎన్నారై సంస్థలతో కలిసి కరోనా సోకిన భారతీయులకు కావల్సిన సాయాన్ని అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement