ప్రతీకాత్మక చిత్రం
మెల్‌బోర్న్: లెడ్.. దీనినే మనం సీసం అంటాం. ఇది ఒక రసాయన మూలకమని మనందరికీ తెలుసు. లెడ్ మానవ శరీరంలోకి వెళ్తే అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనం భారతీయ విద్యార్థులపై చెడు ప్రభావం చూపుతోందని తాజా అధ్యాయనల్లో వెల్లడైంది. రక్తంలో అధికంగా ఉన్న లెడ్ పరిమాణం భారతీయ చిన్నారుల మేధోసంపత్తిని, వారి ఐక్యూ స్థాయిలను హరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. భారతీయ చిన్నారుల రక్తంలోని లెడ్ స్థాయిలను తొలిసారి విశ్లేషించారు. అధ్యయన వివరాలు ప్రకారం... గత అధ్యయనాల్లో తేలిన దాని కంటే తాజా పరిశోధనలో లెడ్ పరిమాణం గణనీయంగా పెరిగింది. అది పిల్లల్లో మేధో వైకల్యానికి కారణమవుతోంది.
ఈ విషయమై మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బ్రెట్ ఎరిక్సన్ మాట్లాడుతూ... ‘చిన్నారుల 100 మిల్లీ లీటర్ల రక్తంలో 7 మైక్రోగ్రామ్‌ల పరిమాణంలో లెడ్ ఉంటే వారి ఐక్యూపై ప్రతికూల ప్రభావం పడుతోందని మా పరిశోధనలో తేలింది. బ్యాటరీలను కరిగించడం (బ్యాటరీ స్మెల్టింగ్) వల్ల భారత్‌లో అధిక స్థాయిలో లెడ్ విడుదలవుతోంది. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. వాహనాలు వాడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం, వాటిలో ఉపయోగించే బ్యాటరీల జీవిత కాలం రెండేళ్లే కావడంతో... బ్యాటరీలను అధికంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. దీని కారణంగా ముఖ్యంగా పట్టణ ప్రాంత్లాలో వాయుకాలుష్యం బాగా పెరుగుతోంది. దీంతో లెడ్ వాతావరణంలోకి అధిక స్థాయిలో చేరుతోంది. ఇది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంద’న్నారు. కేవలం లెడ్ మాత్రమే కాకుండా కొన్ని అయుర్వేద ఔషధాలతోపాటు, నూడుల్స్, సుగంధద్రవ్యాల వల్ల కూడా రక్తంలో లెడ్ పరిమాణం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టి లెడ్ తాలూకు దుష్ఫలితాలను నియంత్రించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment