ఫ్రాన్స్‌ పీఠంపై మేక్రన్‌ | Macron beats Le Pen in French presidential election | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ పీఠంపై మేక్రన్‌

Published Tue, May 9 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

ఫ్రాన్స్‌ పీఠంపై మేక్రన్‌

ఫ్రాన్స్‌ పీఠంపై మేక్రన్‌

► అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి లీ  పెన్‌పై ఘన విజయం
► అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా..
► ప్రపంచ దేశాధినేతల అభినందనలు


పారిస్‌: యూరోపియన్‌ యూనియన్‌ అనుకూలవాది, స్వతంత్ర అభ్యర్థి ఇమ్మాన్యుయేల్‌ మేక్రన్‌(39) ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అతిపిన్నవయసులో అధ్యక్షుడిగా ఎన్నికై ఫ్రాన్స్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. తటస్థవాదిగా ముద్రపడ్డ మేక్రన్‌ విజయంతో ఫ్రాన్స్‌లోనే కాకుండా యూరప్‌లోనూ సంబరాలు మిన్నంటాయి. గతంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేసిన మేక్రన్‌కు అంతగా రాజకీయానుభవం లేకపోయినా.. యూరప్‌ ఐక్యతే ప్రచారాస్త్రంగా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

మేక్రన్‌ 66.1 శాతం ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి లీపెన్‌ 33.9 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. బ్రిటన్‌ వైదొలగడం వల్ల ఈయూలో నెలకొన్న సంక్షోభం  మేక్రన్‌ విజయంతో ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఈయూలో ఇక నుంచి ఫ్రాన్స్‌ కీలకపాత్ర పోషించేందుకు మార్గం సుగమమైనట్లే. దేశంలో స్వతంత్ర అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ఆధునిక ఫ్రాన్స్‌ను ఇంతవరకూ సోషలిస్టులు, సంప్రదాయ వాదులే పాలించారు.

ఫ్రాన్స్‌ గెలిచింది: మేక్రన్‌
గెలుపు అనంతరం ఫ్రాన్స్‌ ప్రజల్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ.. ‘ఫ్రాన్స్‌ గెలిచింది. చాలామంది ఇది అసాధ్యమన్నారు. వారికి ఫ్రాన్స్‌ గురించి తెలియదు. విద్వేషపూరితంగా సాగిన ఎన్నికల ప్రచారంలో బయటపడ్డ సాంఘిక పరమైన విభజనల్ని ఈ ఐదేళ్లలో రూపుమాపుతాను. ఈ విభజన వల్ల కొందరు ఓటర్లు అతివాదం వైపు మొగ్గుచూపారు. నేను వారిని గౌరవిస్తా. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫ్రాన్స్‌లో ఈ రాత్రితో కొత్త అధ్యాయం మొదలైంది. ఇది ఆశ, విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. యూరప్‌ ఐక్యతకు కృషి చేస్తా’అని చెప్పారు. మేక్రన్‌ గెలుపు ఖాయమవడంతో విజయాన్ని అధికారికంగా ప్రకటించకముందే ప్రత్యర్థి, అతివాద నాయకురాలు, మరీన్‌ లీ పెన్‌... ఆయనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.



పారిస్‌ వీధుల్లో సంబరాలు: మేక్రన్‌ గెలుపు ఖాయమని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ముందుగానే చెప్పడంతో ఆదివారం రాత్రి నుంచే పారిస్‌ వీధులు ఆయన మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. గెలుపువార్త తెలియగానే పారిస్‌లోని లూరే మ్యూజియం వద్ద అర్ధరాత్రి వేలాది మంది మద్దతుదారుల సంబరాలు చేసుకున్నారు. ఫ్రాన్స్‌ జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలతో హోరెత్తించారు. ‘ఒడే టు జాయ్‌’ అంటూ యూరోపియన్‌ గీతాన్ని ఆలపిస్తూ మేక్రన్‌కు స్వాగతం పలికారు.  

ఫ్రాన్స్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం: మోదీ
మేక్రన్‌ను పలువురు దేశాధినేతలు అభినందనలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ట్వీటర్‌లో అభినందనలు తెలిపారు. ‘మేక్రన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని, భవిష్యత్తులో భారత్‌ –ఫ్రాన్స్‌ సంబంధాల్ని బలోపేతం చేస్తా’మని మోదీ ట్వీట్‌ చేశారు. ఫ్రాన్స్‌ కొత్త అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీటర్‌లో పోస్ట్‌చేశారు. ఉగ్రవాదంపై రష్యా, ఫ్రాన్స్‌లు కలసికట్టుగా పోరాడాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభిలషించారు. ఫ్రాన్స్‌ తమ మిత్ర దేశమని, మేక్రన్‌తో కలిసిపనిచేసేందు ఆసక్తిగా ఉన్నానంటూ బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే పేర్కొన్నారు.

ఈయూ ఆశలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల మాదిరిగానే ఫ్రాన్స్‌లోనూ జాతీయవాద(అతివాద) అభ్యర్థి లీ పెన్‌ గెలుస్తారేమోననే ఆందోళనకు మేక్రన్‌ తెరదించారు. ఫ్రాన్స్‌లోకి వలసలతో పాటు ముస్లింలు, యూదులకు వ్యతిరేకంగా లీ పెన్‌ ప్రచారం నిర్వహించడంతో పాటు ఈయూ నుంచి ఫ్రాన్స్‌ వైదొలగాలనే వాదనకు మద్దతిచ్చారు. ట్రంప్‌ గెలుపు, బ్రెగ్జిట్‌తో తన గెలుపు ఖాయమని మరీన్‌ ఆశించగా ఫ్రాన్స్‌ ప్రజలు మాత్రం ఆమె విధానాల్ని తోసిపుచ్చారు. యూరప్‌ అనుకూల విధానాలతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు మేక్రన్‌ గట్టి మద్దతునిచ్చారు. దీంతో ఈయూ దేశాలు ఇప్పుడు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.

మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌(సోషలిస్ట్‌) ప్రభుత్వంలో మేక్రన్‌ రెండేళ్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి వైదొలిగారు. అయితే సోషలిస్ట్‌ విధానాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. గ్లోబలైజేషన్‌(ప్రపంచీకరణ)కు ఆయన గట్టి మద్దతుదారు. 2014–16 మ«ధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మేక్రన్‌ స్వేచ్చా ఆర్థిక విధానాలకు ప్రతిఘటన ఎదురైంది. ఆదివారాలు ఎక్కువ శాతం దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. ప్రభుత్వ అధీనంలోని రంగాల్లో తలుపులు బార్లా తెరిపించారు. కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసేలా నిబంధనలు మార్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఎన్‌ మార్చ్‌ అనే కొత్త ఉద్యమం ప్రారంభించాక... లెఫ్టిస్ట్, రైటిస్ట్‌గా కాకుండా తనను తటస్థవాదిగా మేక్రన్‌ ప్రచారం చేసుకున్నారు.

ప్రభుత్వ వ్యయం తగ్గించడం సాధ్యమేనా?
ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఫ్రాన్స్‌ది ఇప్పటికీ కీలకపాత్రే. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఎక్కువ. ప్రభుత్వ వ్యయాన్ని ఏడాదికి 6,400 కోట్ల డాలర్ల చొప్పున తగ్గించడమేగాక, రిటైరైన వారి స్థానంలో నియామకాలు చేపట్టకుండా 1,20,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో మేక్రన్‌ ప్రకటించారు. ఈ మార్పులు అంత తేలికకాదు. జూన్‌లో రెండు దశల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మేక్రన్‌ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో అన్నది కీలకం. అక్కడ ఎక్కువ స్థానాలు సాధిస్తేనే మేక్రన్‌ ప్రతిపాదనలకు పార్లమెంటులో ఆమోదం లభిస్తుంది.   – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement