
ఒంటిపై 11 లక్షల తేనెటీగలతో సాహసం
బీజింగ్: చైనాలో టాయ్యన్ నగరానికి చెందిన 55 ఏళ్ల గావో బింగ్గువో సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. తేనె అమ్ముకునే గావో తేనె టీగలతో సాహస కార్యక్రమం చేశాడు. గావో తన ఒంటిపైకి దాదాపు 11 లక్షల తేనెటీగలను ఆకర్షించాడు. వీటి బరువు 109 కిలోలు. దీంతో గతంలో ఉన్న రికార్డు (85 కిలోలు బరువు)ను గావో బద్దలుకొట్టాడు.
ఈ సాహసం చేసే సమయంలో గావో లోదుస్తులు మాత్రమే ధరించాడు. మొదట కొన్ని వందల తేనెటీగలు మాత్రమై ఆయన శరీరంపై వాలాయి. ఆ తర్వాత లక్షలాది తేనెటీగలు వచ్చి ఆయన ఒంటిపై చేరాయి. గావో తన పెదవులపైకి తేనెటీగలు రాకుండా ఉండేందుకు సిగరెట్ వెలిగించుకున్నాడు. ఈ సాహసం చేసే క్రమంలో ఆయన శరరీ ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగింది. అయినా పట్టుదలతో రికార్డు సృష్టించాడు. అన్నట్టు గావోకు తేనెటీగలతో దశాబ్దాల అనుబంధముంది. 35 ఏళ్లుగా తేనెటీగలను సంరక్షిస్తున్నాడు.