
వాషింగ్టన్: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పక్కనపెడితే... వాటిని ఎలా తప్పించుకోవాలన్నదానిపైనే ఆసక్తి చూపిస్తారు చాలామంది. అయితే ఇక్కడ చెప్పుకునే వ్యక్తి ఈ రెండింట్లో ఏ కోవకు చెందుతాడనేది అంతు చిక్కకుండా ఉందంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి కారు నడుపుకుంటూ వెళుతున్నాడు. అలా అతను కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండే హెచ్‌ఓవీ ప్రదేశానికి వచ్చాడు. అయితే ఆ ప్రదేశంలోకి ఎంటర్ అవాలంటే వాహనం నడిపే వ్యక్తితో పాటు మరొకరు ఉండాల్సిందే. ఒక్కరు ఉంటే మాత్రం ఆ రోడ్డు గుండా వెళ్లడానికి ఆ వాహనాలను అనుమతించరు.
దీంతో అతను తనతోపాటు మనిషిని వెంట తీసుకెళ్లకుండా ఓ అస్థిపంజరాన్ని పట్టుకెళ్లాడు. దాన్ని కారులో ముందు సీటులో కూర్చోబెట్టి సీట్‌బెల్ట్‌కు బదులు తాడు కట్టి, తలకు.. కాదుకాదు.. పుర్రెకు టోపీ పెట్టి ఎంచక్కా వెళ్లాడు. ఇది అక్కడి అధికారుల కంట పడింది. అంతే.. అతని వాహనాన్ని అడ్డుకున్నారు. ఇక అస్థిపంజరాన్ని చూసి నోరెళ్లబెట్టిన అధికారులు దాన్ని ఫొటోతో సహా ట్విటర్‌లో షేర్ చేసి ఈ విషయాన్నంతా పూసగుచ్చినట్లుగా చెప్పారు. కాగా ప్రయాణికుడిలా కారులో దర్జాగా కూర్చొన్న అస్థిపంజరం ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment