
వాషింగ్టన్: కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచ దేశాల ప్రజలంతా పక్షుల్లా రాలిపోతున్నారు. ఇక అమెరికాలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోవిడ్-19తో అక్కడి ప్రజలు కుప్పలు కుప్పలుగా మరణిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి తాను చనిపోతానని తెలిసి భార్యకు హృదయపూర్యక లేఖ రాశాడు. తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుతూ.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని.. తనని మరో పెళ్లి చేసుకోవాలని సూచిస్తూ రాసిన ఈ లేఖ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది. కాగా అమెరికాకు చెందిన జోనాథన్ అనే వ్యక్తి గత నెల రోజులుగా కరోనాతో పోరాటం చేస్తూ చివరికి గురువారం మరణించాడు. అతనికి భార్య కేటీ, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య కేటీ అతడిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లగా జోన్ అప్పటికే మృతి చెందాడు. కాగా కోవిడ్-19 కారణంగా గుండెపోటు రావడంతో జోన్ చనిపోయాడని కేటీకి వైద్యులు తెలిపారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!)
ఇక తన భర్తకు సంబంధించిన వస్తువులను ఆసుపత్రి సిబ్బంది కేటీకి ఇవ్వడంతో వాటిని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం జోన్ ఫోన్ చూస్తుండగా అతడు రాసిన లేఖ కనిపించింది. ‘నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను ఎప్పుడూ కోరుకొని, ఊహించని ఉత్తమైన జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నీ ప్రేమను పొందిన నేను చాలా అదృష్టవంతుడిని. అంతేగాక నీకు భర్తగా.. బ్రాడిన్, పెన్నీలకు తండ్రిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని రాశాడు. అంతేగాక తన భార్యను ఉద్దేశిస్తూ.. ‘‘నేను చూసిన అమ్మాయిల్లో అత్యంత అందమైన, వ్యక్తిత్వం, కేరింగ్ ఉన్న మహిళవు కేటీ. నా పిల్లలకు ఉత్తమైన తల్లిగా నిన్ను చూసిన ఆ క్షణం నా జీవితంలో అత్యంత అద్భుతమైనది. కేటీ.. నిన్ను ప్రేమించే వ్యక్తి జీవితంలో నీకు ఎప్పుడైన ఎదురై.. మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటే అతడిని నువ్వు తిరస్కరించకు’’ అంటూ భావోద్యేగ లేఖ రాశాడు. (అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం)
కాగా జోనాథన్ మార్చిలో కరోనా బారిన పడ్డాడు. మొదట్లో ఇంట్లోనే ప్రత్యేక గదిలో క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత అతడికి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో వైద్యులు అతడికి ఇంట్యూబేట్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇక అతడి ఆరోగ్య పరిస్థితి కాస్తా మెరుగుపడుతుందని, త్వరలో కోలుకుంటాడని వైద్యులు చెప్పడంతో అతడి భార్య కేటి ఊపిరి పిల్చుకుంది. అయినప్పటికీ కొద్ది రోజులకు కోవిడ్-19 కారణంగా వచ్చిన గుండెపోటుతో జోనాథన్ మరణించినట్లు సమాచారం. కాగా అమెరికాలో ఇప్పటీ వరకు 890, 000పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 50, 000పైగా మరణించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. (కిమ్ ఆరోగ్య వదంతులపై ట్రంప్ అసంతృప్తి)