
విమానంలోంచి బిల్డింగ్‌పై పడేశారు
గాల్లో వెళ్లే విమానంలో నుంచి ఓ వ్యక్తిని కిందకు పడేసిన సంఘటన మెక్సికోలో సంచలనం సృష్టిస్తోంది.
మెక్సికో: గాల్లో వెళ్లే విమానంలో నుంచి ఓ వ్యక్తిని కిందకు పడేసిన సంఘటన మెక్సికోలో సంచలనం సృష్టిస్తోంది. మెక్సికోలోని డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు ఎక్కువగా ఉండే ప్రాంతమైన సినోలా రాష్ట్రంలో కొద్ది ఎత్తులో వెళ్తున్న విమానంలో నుంచి ఒక వ్యక్తిని బిల్డింగ్‌పై పడేశారు. ఎల్డొరాడో నగరంలోని ఐఎమ్‌ఎస్‌ఎస్ ఆసుపత్రి మీద ఆ వ్యక్తి శరీరం పడిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన హెల్త్ అధికారి ఒకరు తెలిపారు.
ఆసుపత్రి రూఫ్ నుంచి వ్యక్తి శరీరాన్ని లోపలికి తీసుకొచ్చి చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే, వ్యక్తిని చంపి కిందకు పడేశారా? లేదా ప్రాణాలతోనే కిందకు పడేశారా? అనే విషయాన్ని వైద్యులు వెల్లడించలేదు. కాగా, సినోలా రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు ఒకరిపై ఒకరు ప్రతీకారదాడులు చేసుకోవడం షరామామూలై పోయింది. 2016లో సినోలా డ్రగ్స్ అక్రమ రవాణా డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇక్కడి మరింత రెచ్చిపోయి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి.