ప్రేమ.. ఇష్క్.. కాదల్.. | married for 62 years, died on same time | Sakshi
Sakshi News home page

ప్రేమ.. ఇష్క్.. కాదల్..

Published Fri, Aug 8 2014 10:12 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

ప్రేమ.. ఇష్క్.. కాదల్.. - Sakshi

ప్రేమ.. ఇష్క్.. కాదల్..

ప్రేమలో పడ్డప్పుడు చాలా ప్రమాణాలు చేసుకుంటాం.. నీవు లేకపోతే నేనుండలేనని.. చావు కూడా మనల్ని విడదీయలేదని.. చచ్చేదాకా కలిసే ఉంటామని..అమెరికాలోని బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన డాన్ సింప్సన్, మాక్సైన్ సింప్సన్ కూడా ఇలాంటి ప్రమాణాలే చేసుకున్నారు.. వాటిని నిలబెట్టుకున్నారు కూడా!

62 ఏళ్ల క్రితం..

అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన డాన్ సింప్సన్ సివిల్ ఇంజనీర్. ఓ రోజు పనిమీద బేకర్స్ ఫీల్డ్ వచ్చాడు. ఓ కార్యక్రమంలో మాక్సైన్‌ను చూశాడు. మనసు పారేసుకున్నాడు. అటు మాక్సైన్ పరిస్థితీ అంతే.. మనసులు కలిశాయి. మనువాడారు.. మాక్సైన్‌ను తొలిసారి చూసిన బేకర్స్ ఫీల్డ్‌లోనే స్థిరపడాలని డాన్ నిర్ణయించుకున్నాడు. సంసారం.. ఇద్దరు పిల్లలు.. హ్యాపీ ఫ్యామిలీ.. ఎక్కడికెళ్లినా.. మాక్సైన్, డాన్ ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుని వెళ్లాల్సిందే.. రెండు శరీరాలు, ఒక ఆత్మగా ఉండేవాళ్లు..

20 రోజుల క్రితం..

ఇంట్లో నడుస్తూ జారి పడటంతో డాన్ తుంటి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చేర్చారు.. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది.. అటు కేన్సర్‌తో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాక్సైన్ పరిస్థితి అలాగే ఉంది. డాక్టర్లు లాభం లేదనడంతో వారి పిల్లలు డాన్, మాక్సైన్‌లను ఇంటికి తెచ్చేశారు.. ఇంటికి తెచ్చినా.. ఒకరిని విడిచి మరొకరు ఉంటే గా.. మాక్సైన్ తన కళ్ల ముందే ఉండాలని డాన్ కోరడంతో ఇద్దరికీ ఒకే గదిలో పక్కపక్కనే బెడ్‌లను ఏర్పాటు చేశారు.

నాలుగు రోజుల క్రితం..

ఉదయం సమయం.. డాన్ నిద్ర లేచాడు.. పక్కనే మాక్సైన్.. ఆమె వైపు అలా చూస్తూనే ఉండిపోయాడు.. మాక్సైన్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.. డాన్ వెచ్చని చేతి స్పర్శ.. మాక్సైన్ నీరసంగా కళ్లు తెరిచింది.. ఆమె కళ్లలో అదే మెరుపు.. 62 ఏళ్ల క్రితం డాన్‌ను తొలిసారి చూసినప్పుడు కనిపించిన మెరుపు.. అలా చూస్తూనే.. డాన్ రూపాన్ని తన కళ్లల్లో నింపుకుని.. వెళ్లిపోయింది..
 మాక్సైన్ వెళ్లిపోయింది.. మరి డాన్.. మాక్సైన్ భౌతికకాయాన్ని గదిలోంచి బయటకు తీసుకెళ్తున్నారు.. మాక్సైన్ గది దాటింది.. డాన్ ఈ లోకం దాటివెళ్లిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement