
మిషెల్ ఒబామా ఫోన్ నెంబర్ ట్వీట్ చేయడంతో..
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. వైట్ హైస్ లో గతంలో విధులు నిర్వహించిన ఓ మాజీ ఉద్యోగికి సంబంధించిన ఫోన్ నంబర్‌ను మిషెల్ ఇటీవల ట్వీట్ చేశారు. మిషెల్ ట్విట్టర్లో ఆమెకు 76లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మిషెల్ నుంచి ట్వీట్ రావడంతో ఫాలోయర్లలో చాలా మంది వెంటనే స్పందించారు. ఏదో కారణం ఉండటంతో ఫోన్ నెంబర్ ట్వీట్ చేశారని భావించిన ఫాలోయర్లు ఆ నెంబర్ కు కాల్ చేయడం మొదలుపెట్టారు.
ఆ ఫోన్ అందుబాటులో లేదని రెస్పాన్స్ రావడంతో మిషెల్ ఒబామా ట్విట్టర్ హ్యాక్ అయి ఉండొచ్చునని ఫాలోయర్లు ట్వీట్లు చేశారు. పొరపాటును గ్రహించిన మిషెల్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. మిషెల్ ట్విట్టర్ హ్యాక్ కాలేదని ఆమె సిబ్బంది తెలిపారు. ఆ ట్వీట్ పై మిషెల్ స్పందిస్తూ.. తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ లో క్రియేటివ్ డిజిల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన డంకన్ వోల్ఫ్ నెంబర్ అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ నెంబర్ పనిచేయడం లేదని, ఆ ట్వీట్ తాను పొరపాటుగా చేశానని తెలపడంతో అంతా సర్దుకుంది.