గాల్లో విమానం.. అందులో పొగలు! | mid air smoke in flight creats panic in passengers | Sakshi
Sakshi News home page

గాల్లో విమానం.. అందులో పొగలు!

Published Fri, Sep 23 2016 11:56 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

గాల్లో విమానం.. అందులో పొగలు! - Sakshi

గాల్లో విమానం.. అందులో పొగలు!

గాలిలో ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాంతో జెట్‌స్టార్ విమానంలోని ఒక ఇంజన్‌ను ఆపేసిన పైలట్.. దాన్ని బ్రిస్బేన్‌కు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సిడ్నీ నుంచి కెయిర్న్స్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఎయిర్‌బస్ ఎ 320 విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకదాంట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముందుజాగ్రత్త చర్యగానే ఒక ఇంజన్‌ను పైలట్ ఆపేశారని, దాన్ని బ్రిస్బేన్ మళ్లించారని జెట్‌స్టార్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తమ ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరిస్తున్నారంది. ఇలా విమానంలో పొగలు రావడం చాలా అసాధారణంగా జరుగుతుందని, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై తమ సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చామని కూడా సదరు సంస్థ వివరించింది.

విమానం మొత్తం పొగలు వ్యాపించి ఉండగా ఓ ప్రయాణికుడు తీసిన వీడియోను ఏబీసీ సంస్థ ప్రసారం చేసింది. ఇది తన జీవితంలోనే అత్యంత భయానకమైన క్షణమని సదరు ప్రయాణికుడు ఆండ్రా థాంప్సన్ తన ఫేస్‌బుక్‌లో రాశారు. విమానానికి మంటలు అంటుకున్నాయని, అందువల్లే కేబిన్‌ మొత్తం పొగతో నిండిపోయిందని అన్నారు. తనకు పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాతే విమానంలోకి పొగ వచ్చిందని.. దాదాపు గంట పాటు అది అలాగే ఉందని వెంటే పెర్కిన్స్ అనే మరో ప్రయాణికురాలు తెలిపారు. కొద్ది సెకండ్లలోనే తన కాళ్ల వద్దకు, ముఖం మీదకు, తన పక్క సీటులో కూర్చున్న వ్యక్తి మీదకు ఆ పొగలు వ్యాపించాయని చెప్పారు. తర్వాత విమానంలో ప్రెజర్ కూడా తగ్గిపోయిందన్నారు.

అయితే జెట్ స్టార్ సంస్థ మాత్రం ఈ వాదనలను ఖండించింది. విమానం బ్రిస్బేన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాతే పొగలు కనిపించాయని ఆ సంస్థ తెలిపింది. వీడియో కూడా విమానం ల్యాండ్ అయిన తర్వాత తీసిందేనని చెబుతోంది. ఏసీ యూనిట్ ద్వారా ఈ పొగలు క్యాబిన్‌లోకి వచ్చి ఉంటాయని చెప్పింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement