
మిగ్వెల్ డియాజ్ కానెల్
హవానా: క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ అగ్రనేత మిగ్వెల్ డియాజ్ కానెల్(58) ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. కానెల్ 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బుధవారం ఆయన్ని జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఫిడేల్ అనారోగ్యానికి గురికావడంతో 2006లో రౌల్ అధికారం చేపట్టారు.
అయితే క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా కొనసాగనున్న రౌల్ పర్యవేక్షణలోనే కానెల్ పాలించే వీలుంది. చిన్నచిన్న ప్రైవేట్ సంస్థలను దేశంలోకి ఆహ్వానించడం, చిరకాల ప్రత్యర్థి అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం ఆయన ముందున్న సవాళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత కానెల్ కొంతకాలం ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. మితవాద భావాలతో ప్రశాంతంగా కనిపించే కానెల్..క్యూబా రెబెల్స్, అమెరికాపై మాత్రం తీవ్ర స్వరంతో స్పందించేవారు.
Comments
Please login to add a commentAdd a comment