ఇది కావాలనే చేశారు..!
మిస్ యూనివర్స్ గందరగోళం ఇంకా సర్దుమణగలేదు. గత ఆదివారం వెల్లడించిన మిస్ యూనివర్స్ పోటీ విజేతల ప్రకటనలో తప్పు దొర్లడం పెద్ద దుమారమే రేపింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే విజేతల పేర్లు మార్చి ప్రకటించడం వెంటనే మళ్ళీ పేరు మార్చి సారీ చెప్పడం కొలంబియా ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇది కావాలనే చేశారని మండిపడుతున్నారు.
2015 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫిలిప్పైన్స్ కు చెందిన పియా అలోంజ్ దక్కించుకుంది. గత సంవత్సరం విజేత... కొలంబియా సుందరి పౌలినా వెగాపియా.. అలోంజ్ కు కిరీటం అలంకరించారు. అయితే రెండవస్థానంలో నిలిచిన కొలంబియా సుందరి అరియాడ్నా మాత్రం మొదట తానే విజేత అని చెప్పి... తిరిగి మాట మార్చారని ఎంతో అసహనం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది.
మరోవైపు ఇదే విషయంపై తాజాగా మిస్ జర్మనీ సారా లోరైన్ రెక్ కూడ విమర్శలు గుప్పించింది. ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ఫలితాలు... పోటీల్లో పాల్గొన్న వారెవరికీ సక్రమంగా అనిపించలేదని చెప్పింది. మిస్ ఫిలిప్పైన్స్ విజేత కావాలని తామెవ్వరూ కోరుకోలేదని అంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మిస్ జర్మనీ లోరైన్ రెక్.. '' నేను నిజంగా ఇది నమ్మలేకపోయాను. ఎంతో బాధపడ్డాను. చెప్పాలంటే.. మిస్ ఫ్రాన్స్ రియల్ విన్నర్'' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
మిస్ యూనివర్స్ పోటీల్లోని చివరి దశలో అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాల యువతులు నిలిచారు. అయితే మిస్ ఫిలిప్పైన్స్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోగా... నిర్వాహకుడు పొరపాటున మిస్ కొలంబియాను ప్రకటించడం సర్వత్రా విమర్శలు చోటు చేసుకున్నాయి. పొరపాటును గమనించిన క్షణాల్లోనే తిరిగి మిస్ ఫిలిప్పైన్స్ ను విజేతగా ప్రకటించారు. దీంతో ఎలాగైతేనేం తమకు న్యాయం జరిగిందని ఫిలిప్పైన్స్ ప్రజలు సంతోషపడుతుంటే.. కొలంబియన్లు మాత్రం దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇతర పోటీ దారులు కూడ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.