కాటేస్తే కానరాని లోకాలకే! | Most Poisonous & Most Dangerous creatures | Sakshi
Sakshi News home page

కాటేస్తే కానరాని లోకాలకే!

Published Tue, Aug 4 2015 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

కాటేస్తే కానరాని లోకాలకే!

కాటేస్తే కానరాని లోకాలకే!

సాక్షి, స్కూల్ ఎడిషన్:

పాము కాటుకు మనిషి ప్రాణాలు వదలడం చూశాం... కప్ప నోట్లో కూడా విషం ఉంటుందా? తేలు కొండెంలో విషం ఉంటుందని తెలుసు... సాలె పురుగు కూడా మనిషిని చంపుతుందా?...   కింగ్ కోబ్రా విషం చిమ్మితే ఏనుగు లాంటి బలమైన జంతువు కొన్ని గంటల్లోనే చనిపోతుందని తెలుసు... నత్త నుంచి వచ్చే ఒక్క విషపు చుక్కతో 20 మందిని చంపవచ్చా? అంటే మాత్రం అవుననక తప్పదు. ఇలాంటి పది జీవుల గురించి తెలుసుకుందాం..
 డార్ట్ ఫ్రాగ్...
ఈ కప్ప చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ముదురు నీలం రంగులో ఉండి శరీరం అంతా నల్ల చుక్కలను కలిగి ఉంటుంది. ఈ కప్పలు మధ్య, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనపడతాయి.  ఒక కప్పలో 10 మందిని చంపగలిగేంత విషం ఉంటుంది. ఇవి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.
పుప్ఫర్ ఫిష్...
సముద్రాల్లో ఉండే ఈ పుప్ఫర్ ఫిష్  చాలా ప్రమాదకర జీవి. ముదురు నీలం రంగులో బంతి ఆకారంలో ఉండి శరీరం అంతా ముళ్లు ఉంటాయి. ఈ చేపలో దాదాపు 30 మందిని చంపేంత విషం ఉంటుంది. ఈ విషం లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అయితే అప్పుడే పుట్టిన ఈ చేపలు అంత విషపూరితం కావు. వీటితో చేసే వంటను చైనాలో బాగా తింటారు. ఆ వంటపేరు 'ఫుగు'.
 తేలు..
బంగారు వర్ణంలో ఉన్న ఈ కొండెం కలిగిన తేలు చాలా చురుకుగా ఉంటుంది. తూర్పు, ఉత్తర ఆఫ్రికాల్లోని ఎడారుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇది కుడితే చాలా నొప్పి ఉంటుంది. అంతేకాదు కుట్టిన వెంటనే సరైన వైద్యం అందకపోతే శరీరంలోని చాలా బాగాలు పనిచేయకుండా పోవడంతోపాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
కింగ్ కోబ్రా...
కింగ్ కోబ్రా 18 అడుగుల పొడవుతో ఎక్కువ విషం కలిగిన పాముగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆఫ్రికన్ ఏనుగును కూడా కొన్ని గంటల్లోనే చంపేంత శక్తి దీని విషానికి ఉంది. ఇది కాటు వేస్తే విపరీతమైన నొప్పి ఉంటుంది. అంతేకాదు వెంటనే వైద్యం అందకపోతే చనిపోవడం ఖాయం.
ఇన్‌ల్యాండ్ తైపాన్...
ఈ విషపూరిత తైపాన్‌లు మధ్య ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి. మామూలు కోబ్రాలతో పోల్చితే ఈ పాములు 200 శాతం ప్రమాదకరమైనవి. 100 మందిని చంపగలిగేంత విషం ఈ పాముల్లో ఉంటుంది. అయితే ఇవి మనుషులపై దాడి చేసిన సంఘటనలు చాలా తక్కువ. ఇవి సారవంతమైన నేలలు, రాళ్లల్లో ఎక్కువగా ఉంటాయి.
బాక్స్ జెల్లీ ఫిష్...
 క్యూబిక్ ఆకారంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ చాలా ప్రమాదకారి. సముద్ర జీవి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ 10 అడుగుల పొడువు ఉంటుంది. ప్రతి వైపు 15 స్పర్శాంగాలు ఉంటాయి. ఒక్కో స్పర్శాంగానికి 5000 జీవకణాలు ఉంటాయి. దీని విషం నరాలు, గుండెపై ప్రభావం చూపుతుంది. సముద్రపు ఒడ్డుకు చేరేలోపు చనిపోతారు.
 స్టోన్ ఫిష్..
 కదలకుండా చూడడానికి రాయిలాగా ఉంటుంది కాబట్టి దీనిని రాయి ఆకారపు చేప (స్టోన్ ఫిష్) అంటారు. పసిఫిక్ సముద్రాల్లో ఈ చేపలు ఎక్కువగా ఉంటాయి. గడ్డకట్టిన మట్టి, బురదలాగా ఉండే చోట ఎక్కువగా ఉంటాయి. ఆహారం కోసం, అవసరమైనప్పుడు తప్ప మరే సమయాల్లో ఇది ఎక్కువగా కదలదు. అయితే నిశితంగా గమనిస్తూ ఉంటుంది. వెనుకభాగంలో వెన్నముక కలిగి ఉంటుంది. దీని విషం కూడా అక్కడే ఉంటుంది. ఈ చేప విషం మాత్రం మనపై పడితే విపరీతమైన నొప్పి ఉంటుంది. వాపు వస్తుంది. కండరాలు పనిచేయకుండా పోతాయి. దాదాపు పక్షవాతం వచ్చినంత పని అవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోతే చనిపోవడం ఖాయం.
బ్లూ ఆక్టోపస్...
ఆక్టోపస్ కుటుంబంలోనే ఈ బ్లూ ఆక్టోపస్ చాలా చిన్నది. 20 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది కానీ చాలా ప్రమాదకారి. తన ఉమ్మి ద్వారా రెండు రకాల విషాలను బయటకు పంపిస్తుంది. ఒకటేమో ఆహారం అవసరమైనప్పుడు పీతలను వేటాడడానికి, మరొకటి మనుషులను చంపడానికి. వీటి నుంచి వచ్చే  25 గ్రాముల విషంతో 10 మంది చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ విషం మీద పడితే ఎలాంటి నొప్పి ఉండదు. తిమ్మిరిగా ఉంటుంది. వాంతులు అవుతాయి. వికారంగా ఉంటుంది. శ్వాస కూడా సరిగా తీసుకోలేరు. సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణం పోయినట్లే.
నత్త...
పాలరాతి శంకువు ఆకారంలో ఉండే ఈ నత్తలు ఎక్కువగా భారతదేశ సముద్రాల్లో ఉంటాయి. వీటిల్లో ఎంత ప్రమాదకర విషం ఉంటుందంటే ఒక్క చుక్క విషంతో 20 మందిని చంపగలిగేంత. సముద్రాల్లోకి వెళ్లేవాళ్లు అజాగ్రత్తగా ఉంటే  వీటికి బలి కావలసిందే.
 
 బ్రెజీలియన్ స్పైడర్...
 బ్రెజీలియన్ వండరింగ్ స్పైడర్ పేరుతో పిలిచే ఈ సాలెపురుగు చాలా డేంజరస్. ఇది ప్రమాదకర విష పూరిత సాలె పురుగుగా 2007లో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. నొప్పి తెలియకుండానే చంపేస్తుంది. దీనిని అరటిపండు సాలెపురుగు (బనానా స్పైడర్)గా కూడా పిలుస్తారు. నాలుగు నుంచి ఐదు అంగుళాల పొడవున్న కాళ్లు, 8 కళ్లు కలిగి ఉంటుంది. అందులో రెండు కళ్లు మాత్రం పొడవుగా ఉంటాయి. అడవుల్లోను, ఇళ్లల్లోనూ, జనసంచారం లేని ప్రదేశాల్లో ఇవి నివాసాలు ఏర్పరుచుకుంటాయి. అయితే ఈ సాలె పురుగులు తమ ఆత్మరక్షణకు మాత్రమే విషాన్ని వెదజల్లుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement