భద్రత పేరిట అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరు తరచూ మతపరమైన వివాదాలను రాజేస్తోంది.
కాలిఫోర్నియా: భద్రత పేరిట అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరు తరచూ మతపరమైన వివాదాలను రాజేస్తోంది. తన బుర్ఖాను బలవంతంగా తొలగించారంటూ ఓ మహిళ పోలీసులపై దావా వేసి నష్టపరిహరం రాబట్టింది.
కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌కు చెందిన క్రిస్టో పోవెల్ ఓ చోరీ కేసులో నిందితురాలు. రెండేళ్ల క్రితం ఆమె తన భర్తతో కలిసి కారులో వెళ్తోంది. కారును ఆపి సోదాలు నిర్వహించిన పోలీసులు ఆమె బుర్ఖాను తొలగించి మరీ అరెస్ట్ చేశారు. అలా బుర్ఖా లేకుండానే ఒక రోజంతా ఆమెను స్టేషన్టో ఉంచారు. ఆ తర్వాత ఆమె పూచీకత్తుపై విడుదల అయింది.
తన మత భావాలను, స్వేచ్ఛను దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించారంటూ గతేడాది పోవెల్ స్ధానిక కోర్టులో దావా వేసింది. అరెస్ట్ చేసేందుకు మహిళా అధికారిణిని పిలిపించాలన్న భర్త విజ్ఞప్తిని కూడా అధికారులు పట్టించుకోలేదని దావాలో పేర్కొంది. దీంతో కోర్టు ఆమెకు 85 వేల డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టు లాంగ్ బీచ్ మున్సిపల్ శాఖను ఆదేశించింది.