న్యూయార్క్ : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్ని ఉద్దేశించి ప్రసంగించడం గర్వంగా ఉందన్నారు. గాంధీజీ చెప్పినట్టుగా సత్యం, అహింస ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. ఒక అభివృద్ధి చెందిన దేశం(భారత్) ఐదేళ్లలో 11 కోట్ల శౌచాలయాలు నిర్మించిందని.. ఇది ప్రపంచానికి కొత్త సందేశమని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ప్రస్తావించిన మోదీ.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అన్నారు. దీని ద్వారా 50 కోట్ల మందికి రూ. 5 లక్షల బీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శనీయమని అన్నారు. ఐక్యరాజ్యసమితి మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని అన్నారు. డిజిటలైజేషన్‌తో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. భారత్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 15 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 2 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment