'ఢీ ' బేట్ హిల్లరీదే | "Nasty woman" becomes the feminist rallying cry Hillary Clinton needed | Sakshi
Sakshi News home page

'ఢీ ' బేట్ హిల్లరీదే

Published Fri, Oct 21 2016 3:40 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

'ఢీ ' బేట్ హిల్లరీదే - Sakshi

'ఢీ ' బేట్ హిల్లరీదే

అమెరికాలో వాడివేడిగా అధ్యక్ష అభ్యర్థుల చివరి డిబేట్

పుతిన్ కీలుబొమ్మ ట్రంప్.. ఆయుధ చట్టంలో మార్పులు చేయాల్సిందే: హిల్లరీ
ఆమె చెడ్డ మహిళ: డొనాల్డ్ ట్రంప్


లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చివరిదైన మూడో డిబేట్ బుధవారం రాత్రి వాడివేడిగా సాగింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ట్రంప్ పూర్తిగా ఆరోపణలకే పరిమితం కావడంతో ఈ డిబేట్‌లోనూ హిల్లరీ ఆధిపత్యమే కొనసాగింది. లాస్‌వెగాస్‌లోని నెవడా యూనివర్సిటీలో జరిగిన చివరి డిబేట్‌లో హిల్లరీదే పై చేయిగా మీడియా సర్వేలు సైతం పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల  ఫలితాన్ని అంగీకరించాలా? లేదా? అన్నదానిపై నవంబర్ 8న దృష్టిపెడతానని, అప్పటి వరకూ ఉత్కంఠ కొనసాగుతుందని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతే ఫలితాన్ని అంగీకరించబోనంటూ పరోక్ష సంకేతాలిచ్చారు. హిల్లరీ, ట్రంప్‌లు ప్రారంభంలో కానీ, కనీసం చివరలో కానీ కరచాలనం చేసుకోపోవడం చూస్తే డిబేట్ ఎంత వాడివేడిగా సాగిందో అర్థమవుతుంది.

మీడియా ఓటర్ల మనసుల్ని విషపూరితం చేసింది: ట్రంప్
అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని అంగీకరిస్తారా? అన్న సమన్వయకర్త క్రిస్ వాలెస్ ప్రశ్నకు స్పందిస్తూ...‘ఫలితాన్ని అంగీకరించడంపై నవంబర్ ఎనిమిది వరకూ ఉత్కంఠ కొనసాగిస్తాను. దానిపై అప్పుడు దృష్టిపెడతాను.. ప్రస్తుతం దేనిపైనా దృష్టిపెట్టడం లేదు’ అంటూ ట్రంప్ సమాధానమిచ్చారు. ‘మీడియా నిజాయితీగా వ్యవహరించడం లేదు. అవినీతిమయంగా తయారైంది. వారు ఓటర్ల మనసుల్ని విషపూరితం చేశారు’ అంటూ ట్రంప్ ఒకస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హిల్లరీ జోక్యం చేసుకుని.. ‘ఫలితాన్ని అంగీకరించేందుకు ట్రంప్ ఒప్పుకోపోవడం చాలా భయంకరం. ప్రతీది తాను అనుకున్నట్టుగా లేకపోతే రిగ్గింగ్ జరిగిందని చెప్పడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. ఇది ప్రజాస్వామ్య విధానం కాదు. అమెరికన్లు చాలా తెలివైన వారు. ప్రతి విషయాన్ని గ్రహించగలరు’ అని హిల్లరీ సమాధానమిచ్చారు.

అబార్షన్‌పై నిర్ణయం మహిళల హక్కు.. హిల్లరీ: క్లింటన్ వర్గం మహిళలతో వరుసగా తనపై ఆరోపణలు చేయించారని ట్రంప్ విమర్శించారు. ‘అమెరికా అధ్యక్షురాలు అయ్యేందుకు హిల్లరీని అనుమతించకూడదు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె ఏం చేసిందో, ఇతర విషయాల్లో ఏం చేసిందో అందరికీ తెలుసు... వాటి ప్రకారం ఆమె అధ్యక్ష  పదవికి అనర్హురాలు. పది నిమిషాల పేరు కోసం నాపై 10 మంది మహిళలు ఆరోపణలు చేశారు. వారు చెప్పిందంతా అబద్ధం.  నేను ఏ తప్పూ చేయలేదు అందుకే నా భార్యకు కూడా క్షమాపణ చెప్పలేదు’ అంటూ ట్రంప్ ఆవేశంగా మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఆదాయపు పన్ను చెల్లించకుండా ట్రంప్ మోసగించారంటూ హిల్లరీ ఆరోపించగా.... ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హిల్లరీ చెడ్డ మహిళ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అక్రమ వలసలు, అబార్షన్ హక్కులు, ఆయుధ చట్టంపై చర్చ సందర్భంగా అసహనానికి లోనైన ట్రంప్ సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకునేలా తన వాదన వినిపించారు. అబార్షన్ మహిళల చెత్త నిర్ణయమని, వలసదారులు నేర కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారని, ప్రజలు ఆయుధాలు కలిగిఉండే అంశం రెండో సవరణను నిలుపుదల చేయాలని ట్రంప్ డిమాండ్‌చేశారు. భారత్, చైనా అధిక వృద్ధి రేటులతో అమెరికాను పోల్చిన ట్రంప్... అమెరికా వృద్ధి రేటు పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్య విషయంలో నిర్ణయం తీసుకోవడం మహిళల హక్కని, ఆయుధ చట్టంలో సంస్కరణలు చేయాల్సిందేనని హిల్లరీ చెప్పారు. దేశ అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు సమర్థులు కారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.   


వికీలీక్స్ రష్యా పనే: హిల్లరీ
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆటబొమ్మగా మారతారంటూ హిల్లరీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వికీలీక్స్ వ్యవహారం అమెరికన్లకు వ్యతిరేకంగా రష్యా ప్రభుత్వం చేయిస్తున్న పని. అమెరికన్ వెబ్‌సైట్లు, వ్యక్తుల, సంస్థల ప్రైవేట్ ఖాతాల్ని రష్యా ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది. ఆ సమచారాన్ని వికీలీక్స్‌కు అందచేస్తోంది’ అంటూ హిల్లరీ క్లింటన్ చెప్పారు.

మహిళల్ని ఎక్కువ గౌరవించేది నేనే: ట్రంప్
చివరి డిబేట్‌లో తన వ్యాఖ్యలతో ట్రంప్ ఒక్కసారిగా నవ్వులు పూయించారు. తనక ంటే ఎక్కువగా ఎవరూ మహిళల్ని గౌరవించరంటూ వ్యాఖ్యానించగా ప్రేక్షకులు ఒక్కసారి ముసిముసి నవ్వులు కురిపించారు. మహిళల్ని అవమానించడం గొప్ప చేస్తుందని ట్రంప్ భావించారంటూ హిల్లరీ విమర్శించగా జోక్యం చేసుకుంటూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 
హిల్లరీనే విజేత: సీఎన్‌ఎన్
చివరి డిబేట్‌లోనూ హిల్లరీనే విజేత. సీఎన్‌ఎన్ సర్వే ప్రకారం హిల్లరీ 52% మద్దతు సాధించగా, ట్రంప్‌కు 39 శాతమే అనుకూలంగా ఉన్నారు. సీఎన్‌ఎన్ సర్వే ప్రకారం మూడు డిబేట్లలోను హిల్లరీదే గెలుపు. అలాగే బ్రెయిట్‌బార్ట్ ఆన్‌లైన్ పోల్ ప్రకారం హిల్లరీకి 59.3 శాతం, ట్రంప్‌కు 40.65 శాతం అనుకూలంగా ఉన్నారు.
 
ఎన్నికల రోజు హింస: నిపుణులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజు హింస జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరించారు. నవంబర్ 8న జరిగే ఈ ఎన్నికల్లో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పిలుపునిస్తున్న నేపథ్యంలో అతని అనుచరుల నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చని భావిస్తున్నారు. దీని వల్ల ఓటింగ్‌లో పాల్గొనే ప్రజల సంఖ్య తగ్గే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement