
సంక్షోభంలో నేపాల్ ప్రభుత్వం
ప్రధాని కేపీ ఓలి సారథ్యంలోని నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. భాగస్వామి పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
మద్దతు ఉపసంహరించుకున్న మావోయిస్టు పార్టీ
కఠ్మాండు : ప్రధాని కేపీ ఓలి సారథ్యంలోని నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. భాగస్వామి పక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ప్రధాన విపక్షం నేపాలీ కాంగ్రెస్(ఎన్‌సీ) మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. సీపీఎన్-యూఎంల్(యూనిఫైడ్ మార్క్సిస్టు-లెనినిస్టు) పార్టీల మధ్య మేలో జరిగిన తొమ్మిది సూత్రాల ఒప్పందం, ప్రభుత్వ నాయకత్వ మార్పు ఒప్పందాల అమల్లో ఓలి విఫలమయ్యాని సీపీఎన్ చైర్మన్ ప్రచండ ఆరోపించారు. అందుకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రధానికి లేఖ రాశారు.
ప్రచండ సన్నిహితుల కథనం ప్రకారం.. ఓలి, ప్రచండ మధ్య అధికార మార్పిడికి సంబంధించి మేలో ఒప్పందం జరిగింది. పార్లమెంటు కొత్త బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత అధికారం ప్రచండకు అప్పగిస్తానని ఓలి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒప్పందాన్ని విస్మరించి వచ్చే ఏడాదిన్నర పాటు అధికారంలో కొనసాగడానికే నిర్ణయించుకోవడం వల్లే ప్రచండ నిర్ణయానికి కారణమం టున్నారు. కాగా, సంకీర్ణ ప్రభుత్వంలో తమది రెండో పెద్ద పార్టీ అని.. తమ మంత్రులందరితో రాజీనామాలు చేయిస్తామని సీపీఎన్ నాయకుడు కృష్ణ బహదూర్ మహరా చెప్పారు. ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌సీ ఒప్పుకుందన్నారు.