స్మార్ట్‌ఫోన్‌లకు డిజిటల్ యాంటెనా!
లండన్: భవిష్యత్తులో రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల కోసం అత్యంత సమర్థవంతమైన నూతన యాంటెన్నాలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఉండే యాంటిన్నాల కంటే ఇవి వంద నుంచి వెయ్యి రెట్లు సమర్థవంతం, వేగవంతంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు ఈ నూతన సాంకేతికత కలిగిన యాంటిన్నాలను ఫిన్‌ల్యాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ యాంటెన్నాల ద్వారా ఇంటర్నెట్ వేగం గణనీయంగా పెరుగుతుందని ఆల్టో యూనివర్సిటీకి చెందిన జరీ మత్తి హన్నుల్లా తెలిపారు. ప్రస్తుతం ఉన్న యాంటెన్నాలు ఫోన్ పై భాగంలో కానీ, కింది భాగంలో కానీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉంటాయన్నారు. కానీ ఈ డిజిటల్ యాంటెన్నా ఫోన్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదని అందువల్ల స్క్రీన్ సైజ్ కూడా ఎక్కువగా ఉండేలా నూతన ఫోన్‌లను డిజైన్ చేయవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీటి ద్వారా రేడియేషన్ ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని, మొబైల్‌లో సిగ్నల్స్‌ను అధిక సామర్థ్యంతో అందిస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఈ నూతన సాంకేతికత కలిగిన డిజిటల్ యాంటిన్నా ద్వారా 5జీ మొబైల్స్‌లో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావచ్చని పరిశోధకులు వెల్లడించారు. కాగా, ఈ పరిశోధన ఫలితాలు ఐఈఈఈ యాంటిన్నాన్ అండ్ వైర్‌లెస్ ప్రొపగేషన్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.