
మెక్సికో : మరో భూకంపం మెక్సికోను వణికించింది. ఇప్పటికే వచ్చిన భూకంపంతో దాదాపు పలుచోట్ల మట్టి కుప్పలా మారిన మెక్సికోను తాజాగా మరో భూకంపం బెంబేలెత్తించింది. శనివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. చియాపస్‌లోని శాన్ లుక్వెనోకు 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రకటించారు. కాగా, ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇటీవల సంభవించిన భూకంపానికి మెక్సికో అతలాకుతలం అయింది. ఒక్క ఈ నెలలోనే (సెప్టెంబర్) సంభవించిన 8.2 తీవ్రత, 7.1 తీవ్రత భూకంపాల కారణంగా వందల సంఖ్యలో భవనాలు నేలమట్టం కాగా దాదాపు 400మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా సంభవించిన భూకంపంతో అటు అధికారులు, ప్రజలు మరోసారి అప్రమత్తమయ్యారు. అంతకుముందు సంభవించిన భూకంపాల కారణంగా ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.