మెక్సికో సిటీ: దక్షిణ అమెరికా దేశం మెక్సికో అతిభారీ ప్రకంపనలతో చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్కడ భారీ భూకంపం సంభవించింది. మరోవైపు మూడు నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు సముద్ర అలలు ఎగిసిపడడంతో.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది యూఎస్-ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం.
రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో పశ్చిమ మెక్సికో ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయి. శక్తివంతమైన ప్రకంపనల ధాటిగా చెట్లు, భవనాలు కూలి విధ్వంసం చోటు చేసుకుంది. అయితే.. అదృష్టవశాత్తూ తక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. కాకపోతే భారీగా భవనాలు కూలిపోగా.. దారిపొడవునా చెట్లు వేళ్లతో సహా రోడ్ల మీద కుప్పకూలాయి.
En varias partes de nuestro pais estuvo bastante fuerte el #temblor #sismo #mexico #19septiembre pic.twitter.com/ga7LeMRWRn
— Tapatio Tradi (@tapatiotrad) September 19, 2022
విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 19వ తేదీ మెక్సికో చరిత్రలో పెనువిషాదాలను నింపిన రోజు కావడం. 1985 సెప్టెంబర్ 19వ తేదీన రిక్టర్‌స్కేల్‌పై 8.0 తీవ్రతతో భూకంపం, పది అడుగుల ఎత్తు అలలతో సునామీ సంభవించగా.. ఐదువేల మందికిపైగా మరణించారు. ఇక.. 2017 సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికో మున్సిపాలిటీ పరిధిలోని ప్యూబ్లాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ దాటికి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు.
అయితే తాజా భూకంపంలో.. మాత్రం కేవలం ఒకే ఒక్క ప్రాణం పోయింది. మాంజానిలో లోని ఓ డిపార్ట్‌మెంట్‌స్టోర్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మరణించాడు. గ్లాస్ పడి మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాకపోతే భారీ ప్రకంపనల ధాటికి భవనాలు, చెట్లు ఊగిపోయాయి. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రులు, ప్రయాణాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మొత్తానికి సెప్టెంబర్ 19 భూకంపం సెంటిమెంట్ మెక్సికోను వణికిపోయేలా చేసింది. సునామీ హెచ్చరికలను ఇంకా ఉపసంహరించాల్సి ఉంది అక్కడ.
ఇదీ చదవండి: కంటికి కనిపించని అద్భుతాలను ‘ఆ’ కంటితో చూడొచ్చు..
Comments
Please login to add a commentAdd a comment