లండన్ : వ్యర్థాల నుంచి విద్యుత్ అంటూ ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పటికే మనిషి మూత్రాన్ని విద్యుత్తుగా మార్చేందుకు సైతం అనేక పరిశోధనలు జరిపారు. విద్యుత్ ఉత్పాదకత పెంచేందుకు ప్రపంచమంతా పలు రకాల అధ్యయనాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా చవకైన, శక్తివంతమైన అతి చిన్న ఫ్యూయెల్ సెల్ పరికరంతో మూత్రాన్ని విద్యుత్తుగా మార్చవచ్చని కొత్త తరహా పరిశోధనలద్వారా కనుగొన్నారు.
మూత్రం ఉండే పునరుత్పాదక జీవశక్తిని వినియోగించి ఫ్యూయెల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. లండన్ బాత్ విశ్వవిద్యాలయం, మెరీ యూనివర్శిటీ లు బ్రిస్టల్ రోబోటిక్ ల్యాబరెటరీ ద్వారా సరికొత్త టెక్నాలజీతో పరిశోధనలు నిర్వహించారు. ఈ కొత్త రకం ఫ్యూయెల్ సెల్స్ గురించి ఎలక్ట్రో కిమికా ఆక్టా జర్నల్ లో ప్రచురించారు. దీనిద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఎటువంటి ఖరీదైన వస్తువులు అవసరం లేదని, కార్బన్, కాటన్, టిటానియమ్ వైర్లతో తయారయ్యే అతి చవుకైన కాథోడ్ ఉపయోగించి శక్తివంతమైన విద్యుత్తును వెలికి తీయవచ్చని వివరించారు.
ఆహార వ్యర్థాల్లో... ముఖ్యంగా గుడ్డు తెల్లసొనలోని వొవాల్బుమిన్ ప్రొటీన్, గ్లూకోజ్ లు విద్యుత్తును వెలికి తీసేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. వీటితో ఫ్యూయెల్ సెల్స్ మరింత వేగంగా స్పందించి, మరింత శక్తిని సృష్టించేందుకు వీలవుతుంది. అయితే ఈ పరిశోధనల్లో ఎలక్ట్రోడ్ల పొడవు పెంచి మెలిపెట్టడంద్వారా విద్యుత్ ఉత్పత్తి పదిరెట్లు పెరిగినట్లు కనుగొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా నిరుపేద, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫ్యూయెల్ సెల్స్ ద్వారా వ్యర్థాలను వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాన రచయిత జోన్ ఖౌలర్ వెల్లడించారు.
తాము రూపొందించిన డిజైన్ సంప్రదాయ నమూనాలకంటే తక్కువ ధర కలిగి, మరింత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ వెలికి తీసే మిగిలిన అన్ని పరికరాలకన్నా, మూత్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ఈ ఫ్యూయెల్ సెల్ పరికరంతో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తికావడం గమనించవచ్చని ఖౌలర్ తెలిపారు.