కొరియా: అమెరికాపై అణు బాంబు వీడియో
అమెరికాపై అణు బాంబు వేస్తే ఎలా ఉంటుందో.. ఎంతటి వినాశనం జరుగుతుందో.. ఉత్తరకొరియా ఓ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపింది. ఉత్తరకొరియా వ్యవస్ధాపకుడు కిమ్2 సంగ్ గౌరవార్ధం నిర్వహించిన ఓ మ్యూజికల్ ఈవెంట్‌లో ఈ వీడియోను ప్రదర్శించారు. అందులో ఉత్తరకొరియా వదిలిన మిస్సైల్స్ దెబ్బకు అమెరికా నగరాలు మంటల్లో కాలిపోతున్నట్లు ఉంది. వరుసబెట్టి అమెరికాపై పసిఫిక్ తీరం మీదుగా మిస్సైల్స్‌ను సంధించినట్లు ఉంది.
మిస్సైల్స్ పేలుళ్లకు అమెరికాలోని ముఖ్యనగరాలు తుడిచిపెట్టుకుపోయినట్లు ఉంది. ఆఖరకు కాలిపోతున్న అమెరికా జెండాతో వీడియో ముగుస్తుంది. జెండా కాలుతున్నప్పుడు పూర్తిగా దాన్ని సమాధి చేస్తున్నట్లు దానిపై శవపేఠిక మాదిరి ఆకారాన్ని వీడియోలో చూపారు. వీడియో ప్రదర్శన అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఆనందోత్సహాలతో సంబరాలు జరుపుకున్నారని అక్కడి మీడియా పేర్కొంది. సైనికుల ఆనందహేలను చూసిన అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా ఆనందం కనబర్చారని తెలిపింది.
ఇదే ఈవెంట్‌లో మిస్సైల్స్ దాడి గురించి ప్రత్యేకంగా పాటను కూడా ప్లే చేసినట్లు వెల్లడించింది. అయితే, ఉత్తరకొరియా ఇలాంటి వీడియోలను విడుదల చేయడం ఇది తొలిసారేమీ కాదు. 2013, 2016లలో కొలంబియా, అమెరికా రాజధాని వాషింగ్టన్‌లపై అణుదాడి చేస్తే ఎలా ఉంటుందనే వీడియోను విడుదల చేసింది కిమ్ ప్రభుత్వం. అందులో అమెరికా సైనికులు కన్నీళ్లతో ఏడుస్తున్న వారి బిడ్డలను బావుల్లో పడేస్తున్నట్లు చూపారు. రైలు వెళ్తున్నప్పుడు అమెరికా ఓ కుక్కలా మొరుగుతున్నట్లు వ్యాఖ్యానించారు.
ఉత్తరకొరియా తాజా వీడియో బయటకు రాలేదు. కారణం అక్కడ ఉన్న ఆంక్షలే. దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే ఇంటర్నెట్ వినియోగించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ రేడియో సిగ్నల్స్‌పై ఆ దేశంలో నిషేధం ఉంది. రేడియో సిగ్నల్స్ దేశంలో ప్రవేశించకుండా జామర్స్ వాడతారు. టీవీల్లో కేవలం ప్రభుత్వ చానెల్స్ మాత్రమే వస్తాయి. మరే ఇతర చానెళ్లు ప్రసారం కాకుండా ప్రీ ప్రోగ్రామ్ చేసేశారు.
తాజా వీడియో అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్ధితులను తారాస్ధాయికి చేరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఆ దేశం ఆరో అణు పరీక్షను నిర్వహించబోతుందనడానికి ఇదో సూచనగా భావించొచ్చని చెబుతున్నారు. ఈ పరీక్ష పూర్తయితే అణు సామర్ధ్యం గల ఖండాంతర క్షిపణీ సామర్ధ్యాన్ని ఉత్తరకొరియా సాధిస్తుందని అంటున్నారు.