దక్షిణ కొరియాపై దాడికి ఆదేశం!
సియోల్: ప్రపంచదేశాల ఆంక్షలను లెక్క చేయకుండా హైడ్రోజన్ బాంబు ప్రయోగం నిర్వహించిన ఉత్తర కొరియా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా దక్షిణ కొరియాపై దాడి చేయడానికి సన్నద్ధం కావాలని అధికారులకు ఆదేశాలిచ్చాడన్న వార్తలు ఇప్పుడు కొరియన్ ద్వీపకల్పంలో కలకలం సృష్టిస్తున్నాయి.
కిమ్ జోన్ ఉన్ ఆదేశాలను అమలు చేయడానికి అతని స్పై ఏజెన్సీ ప్రయత్నాలను ప్రారంభించిందని దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీస్ నివేదిక తెలిపింది. సైబర్ దాడులతో పాటు ఇతర దాడులు నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నారని ఆ నివేదికలో వెల్లడించారు. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కార్యకర్తలు, అధికారులపై దాడులు జరపడానికి అవకాశాలున్నాయని దక్షిణ కొరియా గూఢచార ఏజెన్సీ తెలిపింది.
అమెరికా నాలుగు అత్యాధునిక ఫైటర్ జెట్ విమానాలను దక్షిణ కొరియాకు పంపిన ఒక రోజు అనంతరం ఈ వార్తలు రావడం గమనార్హం. గతంలోనూ దక్షిణ కొరియాపై ఉత్తరకొరియా దాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అగ్రారాజ్య అండదండలున్న దక్షిణ కొరియాపై ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కొరియా దాడులకు పాల్పడే సాహసం చేయబోదని విశ్లేషకులు చెబుతున్నారు.