
బరువు తగ్గించే సరికొత్త ఇంజెక్షన్
బాల్టిమోర్: ప్రపంచంలో ఎక్కడైనా సరే అధిక బరువుతో బాధ పడుతున్న వారి బాధ అంతా ఇంతా కాదు. ఎలాగైనా బరువు తగ్గాలనుకుంటారుగానీ అందుకు అంతగా కష్టపడరు. ప్రస్తుతం బరువు తగ్గేందుకు వ్యాయామం, డైట్ కంట్రోల్, మందులు, సర్జరీ అనే నాలుగు పద్ధతులు అందుబాటులో ఉంది. వీటన్నింటికన్నా సులభం, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఐదవ పద్ధతి అందుబాటులోకి వస్తోంది. ఈ పద్ధతినే ‘బారియాట్రిక్ ఆర్టీరియల్ ఎంబోలైజేషన్’ అని పిలుస్తారు. పేరు వింటే కంగారు వేయవచ్చుగానీ అత్యంత సులభమైన ఈ పద్ధతిని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నిపుణులు కనుగొన్నారు.
ఈ అత్యాధునిక పద్ధతిలో లావు తగ్గాలని ఆశించేవారి కడుపులోకి మైక్రోస్కోపిక్ బీడ్స్ అంటే అత్యంత సూక్ష్మమైన పూసలను ఇంజెక్షన్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. అవి ఆకలికి కారణమవుతున్న హార్మోన్ ‘గ్రెలిన్’ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దానివల్ల ఆకలి తగ్గుతుంది. పర్యవసానంగా తినడం కూడా తగ్గిపోతుంది. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే నెల రోజుల్లో 5.9 శాతం, మూడు నెలల్లో 9.5 శాతం, ఆరు నెలల్లో 13.3 శాతం బరువు తగ్గిపోతుందని ప్రయోగాత్మకంగా రుజువైంది.
అలాగే ఈ ఇంజెక్షన్ తీసుకున్న వారిలో రెండు వారాల్లో 81 శాతం, నెల రోజుల్లో 59 శాతం, మూడు నెలల కాలంలో 26 శాతం ఆకలి మందగిస్తుందని హాప్కిన్స్ యూనివర్శిటీలో ఇంటర్‌వెన్షనల్ రేడియోలోజి రిసెర్చ్ విభాగానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ క్లిఫోర్డ్ వైస్ తెలిపారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండవని, ఖర్చు కూడా తక్కువని ఆయన తెలిపారు.